అక్షరటుడే వెబ్డెస్క్: Swara Shree Hegde | సాధారణంగా రెండేళ్ల వయసున్న పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ, తల్లి ఒడిలో కాలక్షేపం చేస్తుంటారు. కానీ కర్ణాటకలోని ( Karnataka ) ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన స్వరశ్రీ హెగ్డే అనే చిన్నారి మాత్రం అందుకు భిన్నంగా సంగీత ప్రపంచంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. కేవలం 2 సంవత్సరాల 10 నెలల పసి వయసులోనే తబలాపై 12 రకాల తాళాలను స్వరబద్ధంగా వాయిస్తూ, నోటితో లయబద్ధమైన బోల్స్ పలుకుతూ ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ (India Book of Records)లో చోటు సంపాదించుకుంది.
Swara Shree Hegde | సంగీత కుటుంబంలో ..
స్వరశ్రీ హెగ్డేకు చిన్నతనం నుంచే సంగీత వాతావరణం లభించింది. ఈమె తండ్రి గురురాజ్ హెగ్డే ప్రముఖ తబలా విద్వాంసుడు కాగా, తల్లి శ్రీలత ఇంగ్లీష్ ప్రొఫెసర్ , హిందుస్థానీ గాయని. హోన్నావరలో ‘స్వరశ్రీ మ్యూజిక్ స్కూల్’ పేరిట వీరు సంగీత పాఠశాలను నిర్వహిస్తున్నారు. తండ్రి గురురాజ్ హెగ్డే వద్ద ప్రస్తుతం 50 మందికి పైగా శిష్యులు తబలా విద్యను అభ్యసిస్తున్నారు.
Swara Shree Hegde | తబలాపై ఆసక్తి..
పాపకు 12 నుంచి 14 నెలల వయసు ఉన్నప్పుడే తబలా వాయించడం పట్ల విపరీతమైన ఆసక్తి కనబరిచింది. కూతురిలో ఉన్న ప్రత్యేక నైపుణ్యాన్ని గమనించిన తల్లిదండ్రులు చిన్నారి కోసం ప్రత్యేకంగా రెండు చిన్న తబలాలను తయారుచేయించారు. తండ్రి ఇతరులకు తబలా నేర్పిస్తున్నప్పుడు పక్కనే కూర్చునే స్వరశ్రీ.. ఆ తాళాలను, బోల్స్ను పరిశీలిస్తూ స్వయంగా అనుకరించడం ప్రారంభించింది. బొమ్మలతో ఆడుకోవడం కంటే ప్రతిరోజూ క్రమం తప్పకుండా తబలా సాధన చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది.
Swara Shree Hegde | వీడియోల ఆధారంగా..
చిన్నారి తబలా వాయిస్తూ, తాళాల బోల్స్ను స్పష్టంగా పలకడం చూసిన శ్రేయోభిలాషుల సలహాతో తల్లిదండ్రులు ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ కు దరఖాస్తు చేసి, పాప సాధన వీడియోలను పంపించారు. వాటిని పరిశీలించిన నిర్వాహకులు అతి పిన్న వయస్కురాలైన తబలా కళాకారిణిగా స్వరశ్రీ హెగ్డేను గుర్తిస్తూ రికార్డును ప్రదానం చేశారు. కూతురు భవిష్యత్తులో శాస్త్రీయ సంగీతంలో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని, సంగీత ప్రపంచంలో అద్భుతాలు సృష్టించాలని ఆమె తల్లిదండ్రులు ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి: Arnab Cyclone | తుపాన్ ఎఫెక్ట్.. సముద్రం అల్లకల్లోలం