Telangana Assembly Day 5 | ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు కీలక బిల్లులు

తెలంగాణ శాసనసభ సమావేశాలు ఐదో రోజు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Assembly Day 5 | తెలంగాణ శాసనసభ సమావేశాలు ఐదో రోజు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ), మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పలు ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. వీటితో పాటు రాష్ట్ర ప్రయోజనాలు, బీసీల హక్కులు, విద్యా రంగానికి సంబంధించిన అంశాలపై సభలో స్వల్పకాలిక చర్చలు జరగనున్నాయి. పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ మహానగర సమగ్ర అభివృద్ధికి సరికొత్త చట్టాన్ని తీసుకురావడంతో పాటు, విద్యారంగం , సామాజిక న్యాయానికి పెద్దపీట వేసేలా అసెంబ్లీలో నేడు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.

Telangana Assembly Day 5  | కోర్ అర్బన్ రీజియన్ బిల్లు ..

హైదరాబాద్ మహానగరం, పరిసర పట్టణ ప్రాంతాల సమగ్ర సమన్వయం, సమర్థవంతమైన పాలన లక్ష్యంగా రూపొందించిన కోర్ అర్బన్ రీజియన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సభ అనుమతి కోరనున్నారు. దశాబ్దాల నాటి పాత జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో రూపొందుతున్న ఈ బిల్లు పట్టణాభివృద్ధి, మౌలిక వసతులు, సమగ్ర నిర్వహణలో ఎంతో కీలకమైనదిగా భావిస్తున్నారు. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల నిర్వహణ, వార్డుల పునర్విభజన, సేవలను మెరుగుపరిచే ‘తెలంగాణ మున్సిపాలిటీల సవరణ బిల్లు’ను ఆమోదించాలని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రతిపాదించనున్నారు. అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు ‘తెలంగాణ ప్రజా విశ్వాసం (నిబంధనల సవరణ) బిల్లు’ను సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరనున్నారు.

Telangana Assembly Day 5 | కుల గణనపై స్వల్పకాలిక చర్చ..

రాబోయే 2027 జనాభా లెక్కల రెండవ విడత ప్రశ్నావళిలో బీసీ, ఇతర వెనుకబడిన తరగతుల వివరాలను స్పష్టంగా చేర్చాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసే అంశంపై సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల సక్రమ అమలుకు బీసీ కుల గణన ఎంత అత్యవసరమో ప్రతిపాదించేందుకు అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరగనుంది. రాష్ట్రంలో ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, నూతన విద్యా విధానాలు, గురుకులాల నిర్వహణ, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయ నియామకాలపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. విద్యా ప్రమాణాల మెరుగుదలపై అధికార, ప్రతిపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తపరచనున్నారు.

ఇది కూడా చదవండి:  Inter Caste Marriage | ప్రేమ వివాహం.. అబ్బాయి ఇల్లు కూల్చివేత

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *