అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Employee DA Release | దసరా Dasara పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరవు భత్యం (DA) విడుదలకు సంబంధించి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు రెండు డీఏలు కలిపి మొత్తం 6.4 శాతం చెల్లించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.
సచివాలయంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల జేఏసీ (JAC) నాయకులతో సుదీర్ఘంగా జరిగిన చర్చలు సఫలమయ్యాయి.
Telangana Employee DA Release | ప్రభుత్వం ప్రకటించిన హామీలు
దసరా కానుకగా రెండు డీఏల (3.64% , 2.74%) చెల్లింపునకు ప్రభుత్వం సమ్మతించింది. అక్టోబరు 1న జరగబోయే రాష్ట్ర కేబినెట్ భేటీలో దీనికి అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు.
- పీఆర్సీ నివేదికను ఈ నెలాఖరు నాటికి తెప్పించి, ఉద్యోగుల వేతన సవరణపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.
- ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లులన్నింటినీ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిగా చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Telangana Employee DA Release | సీపీఎస్ (CPS) రద్దుపై కమిటీ
- వివాదాస్పద సీపీఎస్ రద్దు అంశంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు 3 నెలల కాలపరిమితితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేందుకు ఒప్పుకొంది.
- ఉద్యోగులు లేవనెత్తిన మొత్తం 69 సమస్యల పరిష్కారానికై క్రమం తప్పకుండా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తామని సీఎస్ హామీ ఇచ్చారు.
జేఏసీ ఆందోళనల విరమణ
ప్రభుత్వం సానుకూలంగా స్పందించి స్పష్టమైన హామీలు ఇవ్వడంతో హైదరాబాద్‌లో నిర్వహించాలనుకున్న జేఏసీ అత్యవసర సమావేశాన్ని, తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలను ఉద్యోగ సంఘాల నాయకులు తాత్కాలికంగా వాయిదా వేశారు. పండుగ వేళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో హర్షాతిశయాలు వ్యక్తమవుతున్నాయి.