అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Fertility Services | తెలంగాణలో సంతానలేమి (ఇన్‌ఫెర్టిలిటీ) చికిత్స సేవలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరింత విస్తరించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ Damodara Raja Narasimha అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి దంపతికి నాణ్యమైన సంతానోత్పత్తి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఫెర్టిలిటీ అవుట్‌పేషెంట్ (ఓపీ) క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి Minister ఈ ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జెడ్. చోంగ్తు, ఆరోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ), సరోగసీ రాష్ట్ర State పర్యవేక్షక బోర్డు సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Telangana Fertility Services | 37,300 మంది రోగులకు సేవలు
2024లో గాంధీ ఆస్పత్రి, పేట్లబురుజు ఆస్పత్రిలో ప్రారంభించిన ఐవీఎఫ్ కేంద్రాల పనితీరును సమీక్షించిన మంత్రి, ఇప్పటివరకు రెండు కేంద్రాల ద్వారా సుమారు 37,300 మంది రోగులకు సేవలు అందించినట్లు అధికారులు వివరించారు. ఐవీఎఫ్ చికిత్స పొందిన 23 మంది మహిళలు గర్భం దాల్చగా, 510 మంది ఇన్‌ట్రాయూటరైన్ ఇన్‌సెమినేషన్ (ఐయూఐ) చికిత్స పొందారు. మరో 490 మంది దంపతులకు ప్రస్తుతం ఐవీఎఫ్ చికిత్స కొనసాగుతోంది.

Telangana Fertility Services | దశలవారీగా విస్తరణ
సంతానలేమి చికిత్సను జిల్లా స్థాయి ప్రభుత్వ ఆస్పత్రులకు దశలవారీగా విస్తరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అనుభవజ్ఞులైన ప్రభుత్వ గైనకాలజిస్టుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ఆసక్తి ఉన్న వైద్యులు వారానికి కనీసం ఒక రోజు ప్రత్యేక ఫెర్టిలిటీ ఓపీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
యువతలో సంతానలేమికి గల కారణాలు, సకాలంలో వైద్య చికిత్స అవసరం, అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. గాంధీ, పేట్లబురుజు ఆస్పత్రుల నమూనాలోనే జిల్లా ఆస్పత్రుల్లో కూడా ఐవీఎఫ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
Telangana Fertility Services | 60 కేంద్రాలకు నోటీసులు జారీ
ప్రైవేట్ ఫెర్టిలిటీ కేంద్రాల పనితీరుపై కూడా మంత్రి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 464 నమోదిత ఫెర్టిలిటీ కేంద్రాలు ఉన్నాయని, నిబంధనల ఉల్లంఘనల కారణంగా 60 కేంద్రాలకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన రెండు కేంద్రాల లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేయగా, మరో తొమ్మిది కేంద్రాల లైసెన్సులను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
శ్రీష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఘటనను ప్రస్తావించిన మంత్రి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఫెర్టిలిటీ కేంద్రాన్ని నెలకు కనీసం ఒక్కసారి తప్పనిసరిగా తనిఖీ చేయాలని, నిబంధనలను ఉల్లంఘించే, అనైతిక పద్ధతులు అనుసరించే లేదా రోగులను దోపిడీ చేసే కేంద్రాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.