అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana PRC | పే రివిజన్ కమిషన్ (PRC) నివేదికను తక్షణమే అందించాలని అధికారుల కమిటీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ, ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులతో ముఖ్యమంత్రి శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే వంద రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ (Retirement Benefits) కోసం రూ. 6 వేల కోట్లు చెల్లిస్తామని ప్రకటించారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వంద రోజుల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం రూ. 6 వేల కోట్లు చెల్లించడంతో పాటు పీఆర్సీపై నివేదిక అందగానే నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
Telangana PRC | సమస్యలు పరిష్కరిస్తాం
గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందించాలని సీఎం సూచించారు. తమది స్నేహపూర్వకమైన ప్రభుత్వమన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జూన్ 1 లోగా హెల్త్ కార్డులు అందిస్తామన్నారు.
Telangana PRC | వారి సహకారంతోనే..
రాష్ట్రంలో ఉద్యోగుల సహకారంతోనే సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు రేవంత్రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఉద్యోగులకు ప్రతీ నెలా ఒకటో తేదిన వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. బదిలీల విషయంలో పారదర్శకంగా వ్యవహరించామన్నారు. రెండేళ్లలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టామని వెల్లడించారు. ఉద్యోగ సంఘాల నాయకులు మారం జగదీష్, వి. లచ్చి రెడ్డి, ఏలూరి శ్రీనివాస రావు, జి. శ్రీనివాస్ రెడ్డి, పి. దామోదర్ రెడ్డి, జి. సదానందం గౌడ్, వి. రవీందర్ రెడ్డి, వి. రాజశేఖర్, కె. రామకృష్ణ, ఎస్. రాములు తదితరులు పాల్గొన్నారు.
సంఘాల డిమాండ్లపై స్పష్టతనిచ్చిన ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాల నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 5 న తలపెట్టిన నిరసనతో పాటు అన్ని రకాల నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు.
ఇది కూడా చదవండి : Eatala Rajender comments | రాజకీయాల్లో తోసుకుంటూ పోవాల్సిందే..: ఎంపీ ఈటల

