అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Voter List Revision | తెలంగాణలో ( Telangana ) ఓటర్ల జాబితాను మరింత పక్కాగా రూపొందించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి జులై 24 వరకు ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని మూడు దశల్లో అత్యంత పారదర్శకంగా చేపట్టాలని ఎన్నికల శాఖ నిర్ణయించింది.
Telangana Voter List Revision |మూడు దశల ప్రణాళిక..
మొదటి దశ (సన్నద్ధత): క్షేత్రస్థాయిలో సర్వే ఎలా నిర్వహించాలి, ఏ అధికారికి ఎలాంటి బాధ్యతలు ఉండాలి, బీఎల్‌ఓలు (BLO) , పర్యవేక్షకుల మధ్య పని విభజన వంటి అంశాలపై జిల్లా ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేస్తారు.
రెండవ దశ (శిక్షణ): ఈ దశలో డీఈఓలు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు , వేలాది మంది బీఎల్‌ఓ పర్యవేక్షకులకు శిక్షణ ఇస్తారు. ఇంటింటి సర్వే విధానం, ఫారం-6, 7, 8ల వినియోగం, ఆన్‌లైన్ డేటా ఎంట్రీ ప్రక్రియపై వారికి అవగాహన కల్పిస్తారు.
మూడవ దశ (ముద్రణ): ఇంటింటి సర్వే కోసం అవసరమైన ఎన్యుమరేషన్ పత్రాలను అధికారులు సిద్ధం చేస్తారు. ప్రతి ఓటరు పాత ఫోటో, క్యూఆర్ కోడ్, ఇతర వివరాలతో కూడిన పత్రాలను బీఎల్‌ఓలకు అందజేస్తారు.
Telangana Voter List Revision | కీలక షెడ్యూల్..
తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమానికి సంబంధించి ఎన్నికల అధికారులు కీలక షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ ప్రక్రియలో భాగంగా జూన్ 25 నుంచి జులై 24 వరకు బీఎల్‌ఓల పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను సేకరించే డోర్-టు-డోర్ సర్వే నిర్వహిస్తారు. అనంతరం, జులై 31న ఓటర్ల ముసాయిదా (Draft) జాబితాను ప్రదర్శిస్తారు. ఆ తేదీ నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల నుంచి ఏవైనా ఫిర్యాదులు లేదా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి, వాటిని పరిశీలించి పరిష్కరిస్తారు. ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేసిన తర్వాత, అక్టోబరు 1న ఓటర్ల తుది జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు.
Telangana Voter List Revision | అధికారుల సూచన..
ఓటర్లందరూ ఈ ప్రత్యేక సవరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, జాబితాలో తమ వివరాల్లో ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే నిర్ణీత సమయంలోపు దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. సర్వేకు సంబంధించి లేదా ఓటర్ల జాబితా వివరాలపై ఏవైనా సందేహాలు ఉంటే, ఓటర్లు నేరుగా 1950 అనే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి సమాచారం పొందవచ్చు.
ఇది కూడా చదవండి: International Yoga Day 2026 | “కోల్‌కతాలో యోగా దినోత్సవ వేడుకలు.. పాల్గొననున్న ప్రధాని మోదీ