అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raids on Tahsildar | మరో అవినీతి తిమింగలంపై ఏసీబీ (ACB) అధికారులు కేసు నమోదు చేశారు. లంచాలు తీసుకొని అక్రమాస్తులు కూడబెట్టిన తహశీల్దార్ ఇంటిపై దాడులు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించారు.
రంగారెడ్డి (Rangareddy) జిల్లా ఇబ్రహీంపట్నంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయం (RDO)లో ప్రస్తుతం డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (DAO)గా పనిచేస్తున్న తహశీల్దార్ దేశాని శ్రీనివాస్‌రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. విధి నిర్వహణలో అవినీతి పద్ధతులు, అనుమానాస్పద మార్గాల ద్వారా ఆస్తులు సంపాదించినట్లు ఫిర్యాదులు రావడంతో ఆయన నివాసాల్లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు చేశారు. అతని ఇల్లు, కార్యాలయం, అతని బంధువులు, సహచరులు, ఇతరులకు చెందిన మరో 5 ప్రదేశాలలో ప్రాథమిక సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులను అధికారులు గుర్తించారు.
ACB Raids on Tahsildar | తహశీల్దార్ ఆస్తుల వివరాలు
తహశీల్దార్ శ్రీనివాస్‌రెడ్డికి కర్మన్‌ఘాట్‌లో ఉన్న రెండు నివాస ఫ్లాట్లు ఉన్నాయి. అక్కడే మరో ఒక G+3 పెంట్ హౌస్ (233 చదరపు గజాలు), యాచారం మండలం నల్లవెల్లి గ్రామంలో 10 ఎకరాల 8 గుంటల వ్యవసాయ భూమి, నగర పరిధి, శివార్లలోని పలు ప్రదేశాలలో ఎనిమిది ఖాళీ స్థలాలు, ఉన్నాయి. తహశీల్దార్ ఇతరులతో భాగస్వామ్యంలో బాలాపూర్‌లోని నరేంద్ర బార్ & రెస్టారెంట్‌లో రూ.86 లక్షల పెట్టుబడి పెట్టాడు. మొత్తం ఆస్తుల విలువ రూ.వందల కోట్లు ఉంటుంది.
ACB Raids on Tahsildar | 68 తులాల బంగారం..
తహశీల్దార్ ఇంట్లో రూ.4 లక్షల నగదును అధికారులు సీజ్ చేశారు. అతడి బ్యాంక్ ఖాతాలో రూ. 8,60,431 ఉన్నట్లు గుర్తించారు. 680 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కార్లు, 2 బైక్‌లు, రూ. 11 లక్షల విలువైన గృహోపకరణాలు మరియు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.
దీనిని కూడా చదవండి : Rajampet SI ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై