Thummidihatti Barrage | తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో చర్చలు.. అధికారులకు సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు

రాష్ట్రంలోని ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Thummidihatti Barrage | రాష్ట్రంలోని ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ( Revanth Reddy ) ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)లోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీతో పాటు డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాలపై అధికారులతో విపులంగా చర్చించారు.

Thummidihatti Barrage | సిద్ధం కావాలని ఆదేశం..

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై ఈ భేటీలో ప్రధాన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు అవసరమైన అన్ని ఆధారాలు, నివేదికలతో సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య సమావేశానికి సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే సానుకూలంగా స్పందించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన భేటీల వివరాలను కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

Thummidihatti Barrage| పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

సమీక్ష సమయంలో అధికారులు బ్యారేజీ డిజైన్‌పై సీఎమ్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మిస్తే ఎంత పరిమాణంలో నీటిని ఎత్తిపోయవచ్చో వివరించారు. అలాగే ఈ ఎత్తు వల్ల పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలో ఏ స్థాయిలో ముంపు ప్రభావం ఉంటుందనే అంశంపై పూర్తి వివరాలను అందించారు.

Thummidihatti Barrage | 2 లక్షల ఎకరాలకు ..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కనీసం 2 లక్షల ఎకరాలకు వీలైనంత త్వరగా సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకోసం 152 మీటర్ల ఎత్తుతోనే బ్యారేజీ నిర్మించేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ మేరకు పొరుగు రాష్ట్రంతో చర్చలు జరిపి వారిని మెప్పించేందుకు వీలుగా పక్కా నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను పురమాయించారు.

Thummidihatti Barrage | నీటి కేటాయింపులు..

మిగతా ప్రాజెక్టుల నీటి వినియోగంపై కూడా సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. డిండి ప్రాజెక్టుకు 0.5 టీఎంసీలు, అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి 1 టీఎంసీ నీటిని కేటాయించాలని ఆదేశించారు. వీటితో పాటు ఏదుల రిజర్వాయర్‌కు అదనంగా 0.6 టీఎంసీల నీటిని కేటాయించాలన్నారు. ఈ కేటాయింపులకు అనుగుణంగా అవసరమైన పంప్ హౌస్‌ల నిర్మాణం, పంపుల అమరిక పనులను వెంటనే ప్రారంభించాలని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:  Kamareddy Child Kidnapping | రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం.. పోలీసుల అదుపులో నిందితులు!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *