అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Traffic Restrictions | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేలాది మంది మహిళలు బతుకమ్మ ఆడటానికి తరలిరానున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా అప్పర్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. బతుకమ్మ వేడుకలు ట్యాంక్ బండ్‌లోని అమరవీరుల స్మారక చిహ్నం నుంచి రోటరీ చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని బతుకమ్మ ఘాట్ వరకు జరుగుతాయి. దీంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ రద్దీ ఉండనుంది.
Traffic Restrictions | ట్రాఫిక్ మళ్లింపులు
తెలుగు తల్లి జంక్షన్, కర్బలా మైదాన్ జంక్షన్ల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ట్యాంక్ బండ్ వైపు వచ్చే సాధారణ వాహనాలను అనుమతించరు. అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఫ్లైఓవర్ ప్రారంభంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్, కట్టా మైసమ్మ, డీబీఆర్ మిల్స్, ఇందిరా పార్క్, గాంధీ నగర్ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ మీదుగా మళ్లిస్తారు. ఖైరతాబాద్‌లోని వివి విగ్రహం వద్ద వాహనాలను ఇందిరా గాంధీ విగ్రహం (నెక్లెస్ రోటరీ) వద్ద ప్రసాద్స్ ఐమాక్స్, మింట్ కాంపౌండ్ మార్గాల వైపు మళ్లిస్తారు. నల్లగుట్ట జంక్షన్ నుండి బుద్ధ భవన్ వైపు ప్రయాణించే వాహనాలను అనుమతించరు. నల్లగుట్ట ఎక్స్ రోడ్స్ వద్ద రాణిగంజ్, నెక్లెస్ రోడ్ వైపు మళ్లిస్తారు.
Traffic Restrictions | ఆర్టీసీ బస్సులు సైతం..
సికింద్రాబాద్ నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)కు వెళ్లే అంతర్ జిల్లా బస్సులను స్వీకర్-ఉప్కర్ జంక్షన్ వద్ద మళ్లిస్తారు. అవి ఎంజీబీఎస్ చేరే ముందు వైడబ్ల్యుసీఏ, సంగీత్, మెట్టుగూడ, తార్నాక, నల్లకుంట, ఫీవర్ హాస్పిటల్ ఎక్స్ రోడ్, బర్కత్‌పురా, టూరిస్ట్ హోటల్, నింబోలియడ్డ, చాదర్‌ఘాట్ మరియు రంగ్ మహల్ మీదుగా ప్రయాణిస్తాయి. ఈ మళ్లింపు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అమలులో ఉంటుంది. సిటీ బస్సులు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు వెళ్లే ముందు, కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్, జబ్బర్ కాంప్లెక్స్, కావడిగూడ ఎక్స్ రోడ్స్, గాంధీ నగర్ టి జంక్షన్, గోశాల, ధోబీఘాట్, స్విమ్మింగ్ పూల్, బండ మైసమ్మ, ఇందిరా పార్క్, కట్ట మైసమ్మ మీదుగా మళ్లిస్తారు.
Traffic Restrictions | పార్కింగ్ ప్రదేశాలు
బతుకమ్మ వేడుకలకు హాజరయ్యే ప్రజల కోసం పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ప్రజలు తమ వాహనాలను స్నో వరల్డ్, ఎన్టీఆర్ స్టేడియం, అమరవీరుల స్మారక చిహ్నం, ఎన్టీఆర్ ఘాట్ పార్కింగ్ ప్రాంతం, ఎన్టీఆర్ గార్డెన్స్, హెచ్ఎండీఏ గ్రౌండ్, లుంబినీ పార్క్, బి.ఆర్.కె. భవన్ రోడ్డులో పార్క్ చేయాలి.
దీనిని కూడా చదవండి : Kidnapping Case | పోలీసులమని చెప్పి రూ.1.3 కోట్లు వసూలు