అక్షరటుడే, తెయూ క్యాంపస్: TU NEET Duties | జాతీయస్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే నీట్ (NEET) పరీక్ష నిర్వహణలో తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) తీరు విమర్శలకు తావిస్తోంది. వర్సిటీ సిబ్బంది ఉన్నప్పటికీ బయటి వారికి విధులు కేటాయిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
TU NEET Duties | పారదర్శతకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండగా..
‘నీట్’ పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరి ఎంపిక నిబంధనలకు అనుగుణంగా, నిష్పాక్షికంగా జరగాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ యూనివర్సిటీలో నీట్ పరీక్ష కేంద్రాల నిర్వహణలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీలో అనుభవజ్ఞులైన సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ, వారిని పక్కనపెట్టి బయటి వ్యక్తులకు విధులు అప్పగించడం అనుమానాలకు తావిస్తోంది. ఉద్యోగుల వర్గాల సమాచారం ప్రకారం పరీక్షా నిర్వహణలో అనుభవం ఉన్న ఉద్యోగులకు అవకాశం ఇవ్వకుండా, అధికారులకు పరిచయం ఉన్న వ్యక్తులు, బంధువులు, వారి సిఫార్సుతో వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యం కల్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదివారం ‘నీట్’ పరీక్ష జరగనుంది. ఈ వ్యవహారం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది.
TU NEET Duties | సొంత సిబ్బంది ఉన్నప్పటికీ..
యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో (outsourcing employees) చాలామందికి గతంలో పరీక్షల నిర్వహణలో అనుభవం ఉంది. అయినప్పటికీ వారిని పరిగణనలోకి తీసుకోకుండా, బయటి వ్యక్తులకు విధులు వేయడంపై యూనివర్సిటీ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రమాణాలతో బయటి వ్యక్తులను ఎంపిక చేస్తున్నారని, పారదర్శకత పాటించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఎవరెవరి సిఫార్సుతో వారికి అవకాశం ఇచ్చారని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.?
TU NEET Duties | విధుల కేటాయింపులో బంధుప్రీతి?
పరీక్ష విధుల్లో తమకు తెలిసిన వ్యక్తులకు, బంధువులకు, పరిచయస్తులకు విధులు ఇప్పించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్షల విధుల్లో పాల్గొంటే అదనపు పారితోషికం లభించే అవకాశం ఉండటంతో ఈ విధులపై ఆసక్తి ఎక్కువగా ఉంటుందని ఉద్యోగులు చెప్తున్నారు. నీట్ వంటి జాతీయ పరీక్షల్లో చిన్న పొరపాటు జరిగినా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తుంది. ఇలాంటి పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బంది ఎంపికలో కూడా స్పష్టమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవి పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే యూనివర్సిటీ ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఏళ్లుగా యూనివర్సిటీలో సేవలందిస్తున్న ఉద్యోగులకు అవకాశం ఇవ్వకుండా, బయటి వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

ఇది కూడా చదవండి: ఇంటర్నేషనల్ వేదికపై గ్లోబల్ కాంబినేషన్!