అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipality | మున్సిపాలిటీ సమావేశాల్లో ప్రజలకు అవసరం లేని అంశాలను ఎజెండాలో చేరుస్తున్నారని.. ఐదు నెలలుగా ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా జరగలేదని బీజేపీ కౌన్సిలర్లు (BJP Councilors) ఆరోపించారు. ఈ మేరకు పట్టణంలో వారు ప్రెస్‌మీట్ పెట్టారు.
Kamareddy Municipality | చెప్పినట్లు తల ఊపడానికి ఇది స్కూల్ కాదు
చెప్పినట్టు తల ఊపడానికి ఇది స్కూల్ కాదు అని బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుల దుర్వినియోగంపై ప్రశ్నిస్తే కుంటిసాకులు చెప్పి గొడవ చేస్తున్నామని ఛైర్పర్సన్ అనడం సరికాదన్నారు. ఛైర్పర్సన్ పీఠంపై ప్రజలు కూర్చోబెట్టింది ఇష్టం వచ్చిన ఏజెండాలు పెట్టి జేబులు నింపుకోవడానికి కాదన్నారు. మున్సిపాలిటీలో ఛైర్పర్సన్ ఉన్నప్పటికీ అధికారులంతా అంతా సార్కే తెలుసని చెబుతున్నారని, ఆ సార్ ఎవరో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆల్‌పార్టీ సమావేశంలో ప్రజలకు లబ్ధి చేకూరే ఎజెండాలు పెట్టాలని, అత్యవసర బిల్లులకు ఆమోదం తెలుపుతామని తాము సూచించినా పట్టించుకోలేదన్నారు. ప్రజా సంక్షేమానికి వార్డుకు రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.2.45 కోట్ల బిల్లులు పెట్టగా, జేబులు నింపుకోవడానికి మాత్రం రూ.13 కోట్ల బిల్లులు పెట్టారని ఆరోపించారు. ఆ రూ.13 కోట్ల లెక్కలు చెప్పాలని, దానిపై చర్చించాలని అడిగితే కుంటిసాకులు అని చెప్పడం ఏమిటని నిలదీశారు.
Kamareddy Municipality | జేసీబీ కొనుగోలుకు తీర్మానం చేసినా..
గతంలోనే జేసీబీ కొనుగోలుకు తీర్మానం చేసినా మళ్లీ అద్దె కోసం రూ.30 లక్షలు, రూ.15.50 లక్షల బిల్లులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కొత్త జేసీబీ కొంటే రూ.35 లక్షలతో పని అవుతుందని, అద్దె పేరుతో రూ.45 లక్షల బిల్లులు పెట్టడం దేనికి అని ప్రశ్నించారు. ఇప్పటికే ఆమోదం పొందిన అంశాన్ని తెలియకుండా మళ్లీ ఎజెండాలో చేర్చడం, ఒక ఎజెండాను రెండుసార్లు తిరస్కరించినా మూడోసారి అదే అంశాన్ని పెట్టడం సరికాదన్నారు. ప్రజా అభివృద్ధికి సంబంధించిన అంశాలకు మాత్రమే తాము సహకరిస్తామని, అప్పటి వరకు దొంగ ఎజెండాలపై పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
సమావేశం రద్దుకు బీజేపీ కౌన్సిలర్లే కారణమని చెప్పడం తప్పని అన్నారు. లంచ్ బ్రేక్ తర్వాత అందరు కౌన్సిలర్లు వచ్చాక రద్దు చేయాల్సి ఉండగా, ఎవరూ రాకముందే రద్దు అని ప్రకటిస్తే తాము బాధ్యులం ఎలా అవుతామని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో 30 చెత్త వాహనాలు ఉండగా 8 వాహనాలు డంపింగ్ యార్డు వద్దనే ఉన్నాయని, వాటి రిపేరుకు రూ.9.45 లక్షలకు ఆమోదం ఇచ్చినా రిపేరు చేయకుండా ఆ వాహనాలకు డీజిల్ వాడుతున్నామని బిల్లులు రాస్తున్నారని ఆరోపించారు. పని చేసే అధికారులను బెదిరిస్తుండటంతో వారు భయపడుతున్నారని, షాడో కౌన్సిలర్లు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారన్నారు.
ఇది కూడా చదవండి..: BJYM District President | కేంద్ర పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం..