అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ujjain Shahi Masjid | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఉజ్జయినిలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డు విస్తరణలో భాగంగా షాహీ మసీదులో కొంత భాగాన్ని కూల్చి వేయాలని ప్రతిపాదించారు. దీనిని అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున నిరసనకారులు అక్కడకు చేరుకున్నారు.
మసీదు వద్దకు ఆదివారం రాత్రి నుంచే పెద్ద సంఖ్యలో నిరసనకారులు చేరుకున్నారు. మసీదును కూల్చకుండా అడ్డుకునేందుకు యత్నించారు. అప్పటికే అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అనంతరం లాఠీఛార్జ్ చేశారు.
Ujjain Shahi Masjid | 272 నిర్మాణాల కూల్చివేత
ఉజ్జయినిలో 2028లో జరగనున్న ‘సింహస్థ మేళా’కు భారీగా భక్తులు రానున్నారు. దీంతో రాకపోకలకు అనుగుణంగా ఉజ్జయినిలో రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మొత్తం 272 నిర్మాణాలను కూల్చివేతకు గుర్తించారు. ఈ క్రమంలో షాహీ మసీదులో, ప్రార్థనా మందిరం, ఒక మినార్ మరియు సంబంధిత నిర్మాణాలలోని కొన్ని భాగాలను కూల్చివేయాలని ప్రతిపాదించారు. మసీదు సముదాయాన్ని కూల్చివేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ వ్యతిరేకించారు. 600 ఏళ్లనాటి మసీదును కూల్చివేయడం ద్వేషానికి పరాకాష్ట అని ఆయన ఆరోపించారు.
Ujjain Shahi Masjid | భారీగా పోలీసుల మోహరింపు
షాహీ మసీదు వద్ద మసీదు కమిటీ స్వయంగా చేపట్టిన కూల్చివేత పనులు కొనసాగుతున్నాయని ఎస్పీ ప్రదీప్ శర్మ తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా పూర్తి స్థాయి భద్రతా వలయం ఏర్పాటు చేశామన్నారు. ఎవరినీ లోపలికి అనుమతించడం లేదని స్పష్టం ఏశారు. కొంతమంది దుండగులు గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించి, రాళ్ల దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు.
ఇది కూడా చదవండి..: LPU Classes Cancelled | లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో క్లాసులు రద్దు