అక్షరటుడే, వెబ్డెస్క్: UP Elections | ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఎస్పీ, కాంగ్రెస్ కూటమి ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు సీట్ల పంపకంపై తాజాగా ఇరు పార్టీల నేతలు చర్చలు జరిపారు. అయితే 15 నిమిషాల్లో వారి భేటీ ముగియడం గమనార్హం.
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లో పదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. అయితే గత లోక్ సభ ఎన్నికల్లో ఎస్పీ భారీగా సీట్లు గెలుచుకుంది. అదే ఊపులో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తోంది. కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కలలు కంటోంది. ఈ క్రమంలో 403 సీట్లు ఉన్న అసెంబ్లీలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఈ మేరకు సోమవారం కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ నాయకుల మధ్య ఢిల్లీలో జరిగిన మొదటి అధికారిక సమావేశం కేవలం 15 నిమిషాల పాటు మాత్రమే కొనసాగింది. ఈ సమావేశం తర్వాత, సీట్ల పంపకానికి సంబంధించి అభ్యర్థుల గెలుపు అవకాశాలే ప్రాతిపదికగా ఉంటాయని సమాజ్వాది పార్టీ తెలిపింది. మిగతా విషయాలు వెల్లడించలేదు.
UP Elections | రేపు మరోసారి భేటీ
కాగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఇరు పార్టీల నుంచి నలుగురు నాయకులు హాజరయ్యారు. వీరు రేపు మరోసారి సమావేశం కానున్నారు. చాలా సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని, రాబోయే రెండు మూడు రోజుల్లో సీట్ల పంపకం ప్రక్రియ పూర్తవుతుందని యూపీ కాంగ్రెస్ చీఫ్ ఆరాధనా మిశ్ర తెలిపారు.
UP Elections | 100 సీట్లు అడుగుతున్న కాంగ్రెస్
కాంగ్రెస్ 100కు పైగా స్థానాలను తమకు కేటాయించాలని కోరుతోంది. ఎస్పీ మాత్రం 60 సీట్లలోపు ఇవ్వడానికి ఓకే అంటోంది. చర్చల అనంతరం ఈ సంఖ్యపై స్పష్టత రానుంది. తాము బలంగా ఉన్న ప్రాంతాల్లో 60 సీట్లు దక్కించుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌కు సుమారు 105 స్థానాలను కేటాయించింది. ఈసారి కూడా 100 స్థానాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఓటు బ్యాంక్ లేదని ఎస్పీ అంటోంది. 55 స్థానాలను ఇవ్వడానికి ఎస్పీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి..: CJI Surya Kant | కేసు విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ.. ఎందుకో తెలుసా?