అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hawala Cash Seized | రైలులో తరలిస్తున్న హవాలా నగదును రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
హవాలా, డ్రగ్స్, గంజాయి ఇతర అక్రమ రవాణా కోసం నిందితులు రైళ్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిలో నిఘా తక్కువగా ఉంటుందని ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) పరిధిలో భారీగా హవాలా డబ్బును పోలీసులు సీజ్ చేశారు. ముంబై నుంచి సికింద్రాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న రూ.1 కోటి 22 లక్షల 70 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Hawala Cash Seized | ప్రత్యేక తనిఖీలు
ముంబై నుంచి హైదరాబాద్‌కు వస్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్ (Devagiri Express) రైలులో బొల్లారం, మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ల మధ్య అధికారులు ఈ నెల 26న తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో హవాలా వ్యవహారం బయట పడింది. ఆ వ్యక్తి మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన విజయ్ అంబాదాస్ గుప్తాగా పోలీసులు గుర్తించారు. ముంబైలోని “కాంత జ్యువెలరీ” నిర్వహిస్తున్న సంతోష్ సేథ్ అనే వ్యక్తి నుంచి డబ్బులు తీసుకు వస్తున్నట్లు నిందితుడు తెలిపారు.
ఈ డబ్బులను సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లోని “బంటి” అనే జ్యువెలరీ వ్యాపారికి అందజేయడానికి తీసుకువస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ డబ్బు తీసుకు వచ్చినందుకు విజయ్‌కు రూ.5 వేల కమీషన్ ఇస్తారని తెలిపారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Kamareddy police | ప్రేమించిన అమ్మాయి సోదరుల దాడి.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య


