అక్షరటుడే వెబ్డెస్క్: Bakrid Celebrations | సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివృద్ధి, సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ పట్టణంలోని మునుగోడు రోడ్డు ఈద్గాలో నిర్వహించిన బక్రీద్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Komatireddy Venkat Reddy) మీడియాతో మాట్లాడారు.
Bakrid Celebrations | త్యాగానికి ప్రతీక బక్రీద్..
హజ్రత్ ఇబ్రహీం ప్రవక్త చేసిన గొప్ప త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే పండుగే బక్రీద్ అని మంత్రి పేర్కొన్నారు. ఇది కేవలం మతపరమైన పండుగ మాత్రమే కాదని, మానవాళి మొత్తానికి ఒక అద్భుతమైన సందేశాన్నిస్తుందని చెప్పారు. మనకు బాగా ఇష్టమైన దాన్ని కూడా దేవుడి కోసం త్యాగం చేయడానికి సిద్ధపడటమే అసలైన భక్తి అని, ఆ త్యాగ గుణాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పేదలను ఆదుకోవడం, సమాజంలో అందరి బాగు కోరుకోవడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా నల్లగొండ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ఆయన బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

Bakrid Celebrations | మైనారిటీల విద్యా, ఉపాధికి పెద్దపీట
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలకు కల్పించిన 4 శాతం రిజర్వేషన్ల వల్లే ఇప్పుడు విద్యా, ఉద్యోగ రంగాల్లో వారు ఎంతో లబ్ధి పొందారని మంత్రి గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా మైనారిటీ యువత ఉన్నత స్థానాలకు ఎదగాలనే లక్ష్యంతో ఆధునిక పాఠశాలలను నిర్మిస్తోందని, ఉద్యోగాల కోసం జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తోందని వివరించారు. నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ సమక్షంలోనే స్థానిక ‘షాదీఖానా’ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించామని, త్వరలోనే ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి ముస్లిం సోదరులకు అందుబాటులోకి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డితో పాటు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, పలువురు ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Cow National Animal | ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి: ముస్లిం సంఘాలు


