అక్షరటుడే, వెబ్‌డెస్క్: DK Shivakumar CM | కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డి.కె. శివకుమార్ ( DK Shivakumar ) ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్‌లో సాయంత్రం 4 గంటలకు ఈ వేడుక ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముందు శివకుమార్ తన నివాసం వెలుపల వేచి ఉన్న అభిమానులకు, కార్యకర్తలకు నమస్కారం చేశారు. కాంగ్రెస్ అధిష్టానంతో సుదీర్ఘ చర్చల అనంతరం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తుండటంతో, రాష్ట్రంలో అధికారికంగా సరికొత్త కాంగ్రెస్ పాలన ప్రారంభం కానుంది.
DK Shivakumar CM | డిప్యూటీ సీఎం రేసులో..
ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందే కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జి. పరమేశ్వర బుధవారం ఉదయం డి.కె. శివకుమార్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ భేటీతో కొత్త ప్రభుత్వంలో పరమేశ్వరను ఉప ముఖ్యమంత్రిగా నియమించవచ్చనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకోబోయే మరికొందరు ముఖ్య నేతల జాబితాలో సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, ఎం.బి. పాటిల్, యతీంద్ర సిద్దరామయ్య, మరియు ప్రియాంక్ ఖర్గేలు ఉన్నారు.

DK Shivakumar CM | కదలివచ్చిన కాంగ్రెస్ అగ్ర నాయకత్వం..
ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తున్నాయి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే న్యూఢిల్లీ నుండి బెంగళూరుకు బయలుదేరారు. వీరితో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌చార్జి రణదీప్ సుర్జేవాలా సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా బెంగళూరుకు చేరుకున్న మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ.. “నిర్ణయ ప్రక్రియకు కొంత సమయం పట్టినప్పటికీ, మా పార్టీ ఎప్పుడూ సరైన నిర్ణయమే తీసుకుంటుంది. హైకమాండ్ సమర్థవంతంగా పనిచేసి సంస్థను మరింత బలోపేతం చేస్తుందనే నమ్మకం నాకుంది” అని విశ్వాసం వ్యక్తం చేశారు.

DK Shivakumar CM | రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం..
డి.కె. శివకుమార్ సీఎం అవుతుండటంతో ఆయన మద్దతుదారులు, కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా ఆయన సొంత నియోజకవర్గమైన కనకపురలో భారీ బ్యానర్లు, అభినందన బోర్డులు ఏర్పాటు చేసి పటాకులు కాలుస్తూ పండుగలా జరుపుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: KTR Counter to Pawan | తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
