Telangana land rates revised | జూన్‌ 5 నుంచి కొత్త భూముల విలువలు.. ఖజానా నింపుకొనేందుకు ‘హేతుబద్ధత’ మంత్రం!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana land rates revised | తెలంగాణ రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందో.. లేక గ్యారంటీలకు నిధుల సర్దుబాటు భారమైందో కానీ, కాంగ్రెస్ సర్కారు భూములపై కన్నేసింది. తెలంగాణలో సవరించిన భూముల రిజిస్ట్రేషన్‌ మార్కెట్ విలువలు జూన్ 5 నుంచి అమల్లోకి వస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారికంగా ప్రకటించారు.

ఈ సవరణను చాలా ‘శాస్త్రీయంగా’, ‘హేతుబద్ధంగా’, ‘క్షేత్రస్థాయి అధ్యయనం’ ఆధారంగా చేశామని మంత్రి చెబుతున్నప్పటికీ, దీని వెనుక అసలు కథ వేరే ఉందనే విమర్శలు రాజకీయ వర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా ధరలు పెంచిందని విమర్శిస్తూనే.. ఇప్పుడు తాము కూడా అదే బాటలో పయనిస్తూ, మరింత భారంగా రేట్లను సవరించడం గమనార్హం.

akshara today .jpgland 1

Telangana land rates revised | నిపుణుల కమిటీ సాకు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ఆర్థిక నిపుణుడు అరవింద్ సుబ్రమణ్యం ఇచ్చిన నివేదిక, ఉన్నతాధికారుల సలహాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రకటించారు. కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలిస్తే ప్రభుత్వ ఉద్దేశం స్పష్టమవుతోంది.

ఆదాయ వృద్ధిపైనే కన్ను: ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం, మరోవైపు సంక్షేమ పథకాలకు భారీగా నిధులు అవసరం కావడంతో రిజిస్ట్రేషన్ల ద్వారా కనీసం 40 శాతం ఆదాయం పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

భారీగా పెరగనున్న భారం: ఓఆర్‌ఆర్ (ORR), ఆర్‌ఆర్‌ఆర్ (RRR), అభివృద్ధి కారిడార్లు, ఇండస్ట్రియల్ జోన్ల పరిధిలో భూముల విలువలను 25 – 100 శాతం వరకు పెంచేలా స్లాబ్‌లను సిద్ధం చేశారు. జూన్ 5 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెరగనుండటంతో, దానికి అనుగుణంగా స్టాంప్ డ్యూటీ, ఇతర ఛార్జీలు పెరిగి సామాన్యుడి సొంతింటి కల మరింత భారం కానుంది.

Telangana land rates revised | “అప్పుడు శాపం.. ఇప్పుడు శాస్త్రమా?”

గత 2021-22లో అప్పటి భారాస ప్రభుత్వం ఆరు నెలల వ్యవధిలో రెండుసార్లు భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచినప్పుడు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించింది.

కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే కాంగ్రెస్ సర్కారు “ఫార్ములాలు”, “స్లాబ్‌ల” పేరుతో రేట్లు పెంచడాన్ని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

“గత ప్రభుత్వం పెంచితే ప్రజలపై భారమన్నారు.. మరి ఇప్పుడు మీరు పెంచితే అది ‘శాస్త్రీయ సవరణ’ ఎలా అవుతుంది?” అని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే నిర్మాణ వ్యయం పెరిగిపోయి రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో కూరుకుపోయిన వేళ, ప్రభుత్వ తాజా నిర్ణయం ఆ రంగాన్ని మరింత కుంగదీసే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

akshara today .jpgapartmen

Telangana land rates revised | అసమానతల తొలగింపు పేరుతో కొత్త ముసుగు

అపార్ట్‌మెంట్లలో ఫ్లోర్ల వారీగా ఉన్న రేట్ల అసమానతలను తొలగించి, కొన్ని చోట్ల అన్ని అంతస్తులకు ఒకే ధరను వర్తింపజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే ఆర్‌సీసీ, నాన్-ఆర్‌సీసీ నిర్మాణాల రేట్లను ఐదేళ్ల తర్వాత సవరించామన్నారు.

ప్రజలకు ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియ చేశామని చెబుతున్నా.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల (SRO) పరిధిలో అప్‌లోడింగ్ లోపాలు, సర్వే నంబర్ల తప్పులు ఇంకా పూర్తిగా సరిచేయకముందే, హడావుడిగా జూన్ 5 నుంచే అమలు చేయాలని చూడటం వెనుక నిధుల అత్యవసరమే కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి, “మార్కెట్ ధరలకు అనుగుణంగా మార్పులు” అనే కలరింగ్ ఇస్తూ.. తెలంగాణ ప్రభుత్వం సామాన్యుడి జేబుకు పెద్ద చిల్లు పెట్టేందుకే సిద్ధమైందని ఈ రిజిస్ట్రేషన్ల విలువల పెంపు ద్వారా స్పష్టమవుతోంది. ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద పెరిగే ధరల భారం.. రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ దుమారానికి దారితీస్తుందో చూడాలి.

Ram Charan Peddi | గ్లోబల్ ‘మెగా’ క్రేజ్: రాంచరణ్ ‘పెద్ది’ సినిమా కోసం వచ్చిన జపనీస్ మహిళలు!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *