Telangana Public Schools | తెలంగాణలో విద్యా విప్లవానికి శ్రీకారం…’గేమ్‌ ఛేంజర్​గా టీపీఎస్”

ఆరుట్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడానికి ఐదు స్కూల్ బస్సులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Public Schools | తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు కొత్త దిశను చూపించే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. విద్యా సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం తొలి అడుగుగా.. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌కు నాంది పలికింది.

సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS)ను బుధవారం (జూన్​ 17) ఆరుట్లలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా అత్యాధునిక వసతులతో రూపొందిన టీపీఎస్ తెలంగాణ విద్యా రంగంలో నూతన విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టనుంది.

ముఖ్యమంత్రి ఉదయం 9:30 గంటలకు ఆరుట్లకు చేరుకుంటారు. అక్కడ తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్‌రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలిస్తారు.

ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్కూల్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Telangana Public Schools

Telangana Public Schools | కార్పొరేట్‌కు దీటుగా..

రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసి విద్యారంగ బలోపేతానికి సూచనలు తీసుకున్నారు.

ఈ మేరకు తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మ‌న్ డాక్టర్ ఆకునూరి మురళి, స‌భ్యులు డాక్ట‌ర్ చార‌కొండ వెంక‌టేష్, పీఎల్ విశ్వేశ్వ‌ర్ రావు, జోష్నా శివారెడ్డి పర్యవేక్షణలో ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ పాఠశాల రూపుదిద్దుకుంది.

ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందిస్తున్నారు. అంతేకాదు, విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యం కల్పిస్తున్నారు.

Telangana Public Schools | విద్యకు రోల్ మోడల్‌గా..

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌లో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన ఉంటుంది.

ఆధునిక బోధనా పద్ధతులు, సాంకేతిక సదుపాయాలతో సర్కారు బడులపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచేలా తెలంగాణ విద్యకు రోల్ మోడల్‌గా తెలంగాణ పబ్లిక్ స్కూల్ రూపుదిద్దుకుంది.

పైలట్ ప్రాజెక్ట్‌గా రాష్ట్ర సర్కారు నాలుగు పాఠశాలలను ఎంపిక చేసింది. మొదటి విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పోల్కంపల్లి, వంగూరు పాఠశాలలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసింది.

తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్ర‌జా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రంలో దశలవారీగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలనేది లక్ష్యం.

Telangana Public Schools

Telangana Public Schools | ‘ఆరుట్ల టీపీఎస్ అదుర్స్’

కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ వాతావరణం కనిపిస్తోంది. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, విద్యార్థులకు ల్యాబ్స్, విశాలమైన ప్లేగ్రౌండ్స్, గాలి-వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, జిమ్, లైబ్రరీ, డైనింగ్ హాల్స్‌తో పాటు క్రికెట్, ఖోఖో, ఫుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ప్రతి క్రీడకు సంబంధించిన మైదానాలు ఏర్పాటు చేశారు. ఈ క్రీడలకు ప్రత్యేక శిక్షకులను సైతం విద్యార్థులకు అందుబాటులో ఉంచారు.

ఆరుట్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడానికి ఐదు పాఠశాల బస్సులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. ప్రైవేటు బడుల్లో చదువుతున్న పిల్లలను సైతం టీపీఎస్‌లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు.

cm 3

Telangana Public Schools |

ప్రస్తుతం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో మొత్తం 1,814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రీ-ప్రైమరీ విభాగంలో 150 మంది, ప్రైమరీ స్కూల్‌లో 600, హైస్కూల్ రెండు బ్లాకుల్లో కలిపి 800, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 160, రెండో సంవత్సరంలో 104 మంది విద్యార్థులు ఉన్నారు.

తల్లిదండ్రుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోలేక ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి టీపీఎస్‌లో నెలకొంది. ఇలా ప్రభుత్వ విద్యను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఆరుట్లలో సీఎం రెడ్డి ప్రారంభిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్ర విద్యా చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

Phule Ambedkar Ideology | మేధో సంపత్తి గులాంగిరి ఇంకెన్నాళ్లు..? బ్లూ ప్రింట్​ ఇదిగో.. రండి.. బహుజన రాజ్యాధికారం చేజిక్కించుకుందాం!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *