అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలో అనేక ప్రాంతాల్లో నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నల్లాల ద్వారా సరిపోయేంత నీరు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. అయితే కొందరు మాత్రం నల్లాలకు మోటార్లు పెట్టి ఎక్కువ మొత్తంలో నీటిని వినియోగించుకుంటున్నారు. ఫలితంగా కొన్ని ప్రాంతాలకు నీరు సరిపోవడం లేదు. దీంతో అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు.
హైదరాబాద్ నగరంలో నల్లాలకు అక్రమంగా మోటార్లతో నీటిని తోడుతున్న వారిపై దాడులు కొనసాగుతున్నాయి. జలమండలి అధికారులు (Water Board Officials) క్రమంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జలమండలి పైపులైనుకు నేరుగా విద్యుత్ మోటార్లు బిగించి నీటిని అక్రమంగా తోడుతున్న వారిపై చర్యలు చేపడుతున్నారు. గురువారం సికింద్రాబాద్ జోన్ (Secunderabad Zone) పరిధిలోని గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో తెల్లవారు జామున 4 గంటల అధికారులు దాడులు చేశారు. పైపులైనుకు అక్రమంగా బిగించిన 17 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad Water Supply | రూ.5 వేల జరిమానా
వినియోగదారులు తమ నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే.. వారిపై జలమండలి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు మోటార్లు సీజ్ చేస్తామని అధికారులు తెలిపారు. రెండోసారి మోటార్లు బిగిస్తే రూ.5 వేలు జరిమానా విధించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తక్కువ ప్రెజర్తో నీరు సరఫరా అయినా, నీటి సరఫరాలో ఏవైనా ఇతర సమస్యలు తలెత్తినా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: RTC Strike Issues | కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.. ప్రైవేట్ వాహనాల దోపిడీ

