అక్షరటుడే, డిచ్పల్లి: Tractor Accident | ట్రాక్టర్ ఇంజిన్ మీద పడటంతో ఎటూ కదల్లేని స్థితిలో ఓ వ్యక్తి గంటన్నర పాటు నరకయాతన పడ్డాడు. ఈ ఘటన డిచ్పల్లి మండలం మెంట్రాజ్‌పల్లిలో జరిగింది.
Tractor Accident | డిచ్పల్లి మండలం సాంపల్లికి చెందిన..
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. డిచ్పల్లి మండలం (Dichpalli Mandal) సాంపల్లి గ్రామానికి చెందిన మాసూరి సుభాష్ తన ట్రాక్టర్‌పై మెంట్రాజ్ పల్లి కొచ్చేరుకు వెళ్లాడు. చెరువు కట్టపై ఉన్న ట్రాలీని తీసుకొచ్చే క్రమంలో ట్రాక్టర్ ఇంజిన్ ఒక్కసారిగా కట్ట కిందకు జారిపోయి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ ఇంజిన్ కింద సుభాష్ ఎటూ కదల్లేని స్థితిలో ఇరుక్కున్నాడు. దీంతో ఆయన అరుపులు, కేకలు వేశాడు. చెరువు కట్ట ప్రాంతంలో పొలం పనుల్లో ఉన్న రైతులు, విద్యుత్ సిబ్బంది వచ్చి వెతకగా ఈత చెట్ల మధ్యలో ట్రాక్టర్ ఇంజిన్ కింద సుభాష్ కాళ్లు కనిపించాయి. వెంటనే మెంట్రాజ్ పల్లి, సాంపల్లి గ్రామస్థులకు సమాచారం ఇచ్చి వాట్సాప్ గ్రూప్‌లలో సమాచారాన్ని పోస్ట్ చేశారు.
జేసీబీని రప్పించిప్పటికీ ట్రాక్టర్ ఇంజిన్ వరకు వెళ్లే మార్గం కనిపించలేదు. దీంతో సాంపల్లి ఇటుక బట్టీలోని క్రేన్‌ను తెప్పించారు. చెట్ల మధ్యలో ఉన్న ట్రాక్టర్ ఇంజిన్‌ను ఎట్టకేలకు పైకి లేపడంతో ఇంజన్ కింద ఇరుక్కున్న సుభాష్ బయటపడ్డాడు. గంటన్నర పాటు ట్రాక్టర్ కింద ఊపిరి బిగపట్టి బిక్కుబిక్కుమని గడిపిన సుభాష్ క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాధితుడిని వెంటనే ‘108’లో నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. మెంట్రాజ్ పల్లి, సాంపల్లి స్థానికులు క్షణాల్లో ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు యువకుడి ప్రాణాలు కాపాడారు.
ఇది కూడా చదవండి..: Urea Controversy | యూరియా పేరుతో రైతులను రెచ్చగొడితే ఊరుకునేది లేదు..