అక్షరటుడే వెబ్‌డెస్క్: Digital Arrest Scam | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘డిజిటల్ అరెస్ట్’ సైబర్ నేరాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( Central Bureau of Investigation ) ఉక్కుపాదం మోపింది. సుప్రీంకోర్టు అధికారిక వెబ్ సైట్‌ను పోలిన నకిలీ వెబ్ సైట్‌ను సృష్టించి ప్రజలను మోసం చేస్తున్న ముఠాల ఆటకట్టించేందుకు సీబీఐ భారీ ఆపరేషన్ చేపట్టింది. గురువారం ఉదయం నుండి దేశంలోని 16 రాష్ట్రాల్లోని దాదాపు 80 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది.
Digital Arrest Scam | మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఇప్పటివరకు జరిగిన 200కు పైగా డిజిటల్ అరెస్ట్ కేసులతో ఈ ముఠాకు సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నకిలీ కంపెనీలు (షెల్ కంపెనీలు) సృష్టించి, ‘మ్యూల్ బ్యాంక్ ఖాతాల’ ద్వారా సుమారు రూ. 2 కోట్ల అక్రమ నగదును మళ్లించినట్లు నిర్ధారణ అయింది. ఈ కేసులో చెన్నైకి చెందిన బి. నరేష్, కోల్‌కతాకు చెందిన సంజీబ్ సాహాలను సీబీఐ అరెస్ట్ చేసింది. దాడుల్లో కీలకమైన బ్యాంక్ లావాదేవీల రికార్డులు, డిజిటల్ పరికరాలు, మొబైల్ ఫోన్లు , నేరపూరిత పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు.
Digital Arrest Scam | అంతర్జాతీయంగానూ దర్యాప్తు..
ఈ సైబర్ ముఠా కేవలం భారతీయులనే కాకుండా, విదేశీయులను కూడా మోసం చేసినట్లు ఆధారాలు లభించాయి. దీంతో అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలను కూడా సీబీఐ అప్రమత్తం చేసింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో సామాన్యులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్న ఈ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సీబీఐ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: NBK112 Movie Launch | బాలకృష్ణ-కొరటాల శివ సినిమా ప్రారంభం