అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kishan Reddy | హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్‌పోర్ట్‌లు, పౌరసత్వంపై ఒవైసీ వ్యాఖ్యలు చట్టపరంగా తప్పు అన్నారు.
పాస్‌పోర్టు (Passport) కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమేనని, పౌరసత్వానికి (Citizenship) రుజువు కాదని ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై ఒవైసీ స్పందిస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశస్తులకు పాస్‌పోర్టు ఇవ్వరు కదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం పాస్‌పోర్టును పౌరసత్వానికి గుర్తింపు కాదన్నారని, రానున్న రోజుల్లో బీజేపీ సభ్యత్వం ఉన్నవారికి మాత్రమే పౌరసత్వం అంటారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలకు తాజాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు.
Kishan Reddy | తప్పుదోవ పట్టించేలా

ఒవైసీ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని కిషన్‌రెడ్డి అన్నారు. పాస్‌పోర్ట్‌కు, పౌరసత్వానికి మధ్య ఉన్న చట్టపరమైన వ్యత్యాసం తెలుసుకోవాలని హితవు పలికారు. భారత పాస్‌పోర్ట్‌కు విలువ లేదని ఎంఈఏ (MEA) చెప్పలేదని, పాస్‌పోర్ట్ ఒక్కటే పౌరసత్వానికి సంపూర్ణ సాక్ష్యం కాదని తెలిపిందన్నారు. పౌరసత్వం రాజ్యాంగం, పౌరసత్వ చట్టం 1955 ప్రకారమే నిర్ణయమవుతుందని పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చట్టంపై ప్రాథమిక అవగాహన లోపాన్ని లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను గందరగోళానికి గురిచేసే ఉద్దేశపూర్వక ప్రయత్నాన్ని సూచిస్తున్నాయని మండి పడ్డారు.
Kishan Reddy | వారికి కూడా పాస్‌పోర్టు
పాస్‌పోర్ట్ ‘పాస్‌పోర్ట్స్ చట్టం, 1967’ కింద జారీ చేస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇది ప్రయాణానికి సంబంధించిన పత్రం అని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భారత పౌరుడు కాని వ్యక్తికి కూడా పాస్‌పోర్ట్ లేదా ప్రయాణ పత్రాన్ని జారీ చేసే అధికారం ఆ చట్టంలోని సెక్షన్ 20 కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తుందన్నారు. చట్టంలోని నిబంధనల ప్రకారమే, ప్రతి సందర్భంలోనూ పాస్‌పోర్ట్‌ను పౌరసత్వానికి సంపూర్ణ రుజువుగా పరిగణించలేమని స్పష్టం చేశారు.
దీనిని కూడా చదవండి : Sanjay Jaju | తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు నియామకం