అక్షరటుడే వెబ్‌డెస్క్: Voter List Revision | రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై ఎన్నికల సంఘం వెంటనే స్పష్టత ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం , బోధన్ నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపు, చేర్పులపై ఆమె పలు సంచలన విషయాలను ప్రస్తావించారు.
Voter List Revision | కొడంగల్ ఫలితాలపై సందేహాలు..
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొడంగల్ నియోజకవర్గంలో దాదాపు 30 వేల డూప్లికేట్ ఓట్లు ఉండేవని, అందులో పొరుగున ఉన్న కర్ణాటకలోని సెడం నియోజకవర్గం నుండి సుమారు 11 వేల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని ఆమె ఆరోపించారు. సీఎం గెలుపు మార్జిన్ , ఆ డూప్లికేట్ ఓట్ల సంఖ్య దాదాపు సమానంగా ఉండటం గమనార్హమని, ఈసీ ఆయనకు ఏమైనా ఫేవర్ చేసిందా అన్న అనుమానం కలుగుతోందని ఆమె పేర్కొన్నారు.
Voter List Revision | ఈసీ వివక్ష ఎందుకు?
ఈ ఏడాదిన్నర కాలంలో బోధన్ నియోజకవర్గంలో 7 వేల ఓట్లు తొలగించగా, సీఎం నియోజకవర్గం కొడంగల్‌లో మాత్రం కేవలం 808 ఓట్లు మాత్రమే తొలగించడంపై కవిత మండిపడ్డారు. బోధన్‌లో తొలగించిన ఆ 7 వేల మంది ఏమయ్యారు? వారు మరణించారా లేక వలస వెళ్లారా అన్న వివరాలు ఈసీ చెప్పడం లేదని ఆమె విమర్శించారు. నిబంధనల ప్రకారం 2 శాతం కంటే ఎక్కువ ఓట్లు తొలగించాల్సి వస్తే, ప్రతి ఓటరుకు మూడుసార్లు నోటీసులు ఇవ్వాలని ఉన్నప్పటికీ, అధికారులు ఆ నియమాన్ని గాలికొదిలేశారని ఆమె ఆరోపించారు.

Voter List Revision | ఈసీ విఫలమైందని..
రాష్ట్రాల మధ్య ఉండే ఓట్ల డూప్లికేషన్‌ను గుర్తించే వ్యవస్థ ఎన్నికల సంఘం వద్ద లేదని, అలాంటిప్పుడు రూ. 1,400 కోట్లు ఖర్చు చేసి చేపట్టిన ఎస్ఐఆర్ వల్ల ప్రయోజనం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఒక రాష్ట్రంలో ఓటు ఉన్న వ్యక్తికి మరొక రాష్ట్రంలో ఓటు ఉండకూడదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారని, దానికి తాము అంగీకరిస్తామని.. కానీ ఈ నిబంధనను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఈసీ విఫలమైందని అన్నారు. దేశవ్యాప్తంగా డూప్లికేట్ ఓట్లు లేని ‘వన్ నేషన్-వన్ ఓటు’ విధానం రావాలని, ఇందుకోసం ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ , డూప్లికేషన్ అంశాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె కోరారు.
Voter List Revision | శాశ్వత పరిష్కారం..
సంచార జాతులు, వలస కార్మికుల ఓట్ల నమోదులో పారదర్శకత ఉండాలని, ఒక ఇంట్లో ఉండే వారందరికీ ఒకే బూత్‌లో ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. తాను లేవనెత్తిన ప్రశ్నలన్నింటికీ కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యతాయుతమైన సమాధానం చెప్పాలని కవిత విజ్ఞప్తి చేశారు. మాలాంటి కొత్త రాజకీయ పార్టీలకు పారదర్శకమైన ఓటర్ల జాబితా అత్యంత కీలకమని, ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరగాలంటే ఈ అపోహలను ఈసీ నివృత్తి చేయాలని ఆమె కోరారు.
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు, బంజారాహిల్స్ తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ…
🔹సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో కర్ణాటక ఓటర్లు
🔹సెడం నియోజకవర్గం నుంచి 11 వేల మంది కొడంగల్ లో ఓటర్లుగా ఉన్నారు
🔹కొడంగల్ లో 22 వేల… pic.twitter.com/QhXKw3NfLJ
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) June 29, 2026
ఇది కూడా చదవండి: Vangalapudi Anitha | గంజాయి సాగును అరికట్టాం : ఏపీ హోం మంత్రి అనిత