అక్షరటుడే, వెబ్‌డెస్క్: Government Employees Degree | సర్కారు కొలువులో ఉంటూ ముందస్తు అనుమతి లేకుండా ఉన్నత చదువులు చదివే వారిపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిబంధనల ప్రకారం శాఖాపరమైన అనుమతి తీసుకోకుండా పూర్తి చేసిన LLB (రెగ్యులర్) డిగ్రీని ధృవీకరించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
Government Employees Degree | తిరస్కరణ
ఒక ప్రభుత్వ ఉద్యోగి తన విధుల్లో కొనసాగుతూనే మూడేళ్ల రెగ్యులర్ LLB కోర్సును పూర్తి చేశారు. అయితే, సదరు డిగ్రీని తన సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు చేయాలని, పదోన్నతులకు కూడా పరిగణనలోకి తీసుకోవాలని సదరు ఉద్యోగి చేసిన అభ్యర్థనను ఉన్నతాధికారులు తిరస్కరించారు.
దీంతో ఆ ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ పి. సామ్ కోశి, జస్టిస్ లక్ష్మణ్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా కోర్టు పలు అంశాలను వెల్లడించింది.

Government Employees Degree | విధుల్లో ఉంటూ రెగ్యులర్ చదువు ఎలా సాధ్యం?
1978 నాటి ప్రభుత్వ మెమో ప్రకారం.. సర్కారు ఉద్యోగి ఎవరైనా ఉన్నత చదువులు చదవాలనుకుంటే ముందస్తుగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని పేర్కొంది. పిటిషనర్ ఈ నిబంధనను పాటించలేదని తెలిపింది.
ఉద్యోగి పనిచేసే చోటుకు, కళాశాలకు మధ్య ఉన్న దూరం (దాదాపు 50 కి.మీ.) దృష్ట్యా, విధులకు ఆటంకం కలగకుండా రెగ్యులర్ కోర్సు చదవడం అనేది సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఇది విధి నిర్వహణలో క్రమశిక్షణను దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది.
ముందస్తు అనుమతి లేకుండా డిగ్రీ చదివి, తర్వాత దానిని ధృవీకరించాలని కోరడం సమంజసం కాదని, అలాంటి డిగ్రీలు సర్వీస్ ప్రయోజనాలకు పనికిరావని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు పిటిషన్‌ను కొట్టివేసింది.
ఈ తీర్పు ద్వారా సర్కారు ఉద్యోగులు క్రమశిక్షణతో వ్యవహరించాలని, ఉన్నత చదువుల విషయంలో తప్పనిసరిగా సర్కారు అనుమతి పొందాలని హైకోర్టు మరోసారి గుర్తుచేసింది.