అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Additional Collector Farewell | నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఎస్.కిరణ్ కుమార్కు మంగళవారం ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు(Retirement Ceremony) పలికారు.
కలెక్టరేట్ (Nizamabad Collectorate) అధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సన్మాన మహోత్సవం నిర్వహించారు.
Additional Collector Farewell | ఎంతో సమర్ధత కలిగిన అధికారి కిరణ్కుమార్..
కార్యక్రమానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) ముఖ్య అతిథిగా విచ్చేసి ఉద్యోగ విరమణ చేస్తున్న అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ను పూలమాలలు, శాలువాలతో సత్కరించి, జ్ఞాపిక బహూకరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంతో సమర్ధత కలిగిన అధికారి పదవీ విరమణ చేస్తుండటం జిల్లా యంత్రాంగానికి ఎంతో లోటని అన్నారు. తన మొదటి పోస్టింగ్ భద్రాద్రి జిల్లాలో ట్రైనీ కలెక్టర్గా ఇదివరకు కిరణ్ కుమార్తో కలిసి పని చేశానని కలెక్టర్ గుర్తుచేసుకున్నారు.
ప్రస్తుతం తాను కలెక్టర్గా కొనసాగుతున్న నిజామాబాద్ జిల్లాలో ఆయన పదవీ విరమణ చేయడం కాకతాళీయం అన్నారు. ఎంతో ఒత్తిడితో కూడుకుని ఉండే రెవెన్యూ శాఖలో డీఆర్వోగా, అదనపు కలెక్టర్గా ఎంతో సమర్థంగా విధులు నిర్వహించారని, ప్రత్యేకించి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు, రెవెన్యూ శాఖాపరమైన అంశాలలో ఒత్తిడికి గురి కాకుండా ఓపికతో బాధ్యతాయుతంగా పని చేశారని కొనియాడారు.
Additional Collector Farewell | ఉద్యోగవిరమణ సహజం..
ఉద్యోగులకు పదవీ విరమణ సహజమని, 30ఏళ్లకు పైగా వివిధ హోదాలలో ఎలాంటి రిమార్క్స్ లేకుండా సేవలు అందించడం ఎంతో గొప్ప విషయం అని కలెక్టర్ అన్నారు.
అనేక సందర్భాల్లో కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశం లేకుండా ఉద్యోగులు విధి నిర్వహణలో నిమగ్నం కావాల్సి వస్తుందని అన్నారు. పదవీ విరమణ చేస్తున్న అదనపు కలెక్టర్, వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని కలెక్టర్ ఆకాంక్షించారు. నచ్చిన వ్యాపకాన్ని ఎంచుకుని మానసిక ప్రశాంతతతో, కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన జీవనం గడపాలని ఆకాంక్షించారు.
అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భుజంగరావు మాట్లాడుతూ.. ఉన్నత హోదాలో కొనసాగినప్పటికీ ఉద్యోగాలతో కిరణ్ కుమార్ ఎంతో సౌమ్యంగా, స్నేహభావంతో మెలిగేవారని అన్నారు.
ఉద్యోగ విరమణ చేసిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో అదనపు కలెక్టర్ గా తాను సమర్ధవంతంగా విధులు నిర్వర్తించేందుకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పూర్తి సహకారం అందించారని కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్వో గీత, ట్రైనీ ఆర్డీవో సందీప్, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన అక్బరుద్దీన్