అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : NEET Exam | జిల్లాలో ఆదివారం ‘నీట్’ పరీక్ష విజయవంతంగా ముసిగింది. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో(Giriraj Government Degree College) ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) ఆకస్మికంగా తనిఖీ చేశారు.
NEET Exam | ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా..
‘నీట్’ పరీక్ష నిర్వహణ తీరుతెన్నులను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీసీ కెమెరాలు పని చేస్తున్నాయా లేదా అని పరిశీలించిన కలెక్టర్ పుటేజీల ఆధారంగా నిర్ణీత సమయంలోనే ప్రశ్నాపత్రాలను తెరిచారా.. లేదా.. అన్నది నిర్ధారణ చేసుకున్నారు. బయోమెట్రిక్ హాజరు సేకరణలో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కాపీయింగ్, పేపర్ లీక్‌కు అవకాశం లేకుండా పరీక్షా కేంద్రంలోని ఆయా గదుల వద్ద ఏర్పాటు చేసిన జామర్లను, తాగునీటి వసతి, ప్రథమ చికిత్స వసతులతో కూడిన ఏఎన్ఎం బృందాలు పనితీరును పరిశీలించారు.
NEET Exam | మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు..
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎగ్జామ్(NEET) హాల్లోకి సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేనందున అభ్యర్థులను మెటల్ డిటెక్టర్లలతో క్షుణ్ణంగా తనిఖీ చేశామన్నారు. జిల్లాలో నీట్ పరీక్షకు 86.55 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని.. మొత్తం 3,459 మంది అభ్యర్థులకు గాను 2,994 మంది పరీక్ష రాయగా, 465 మంది గైర్హాజరయ్యారని వివరించారు. జిల్లా యంత్రాంగం ముందస్తుగానే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో, సజావుగా నీట్ పరీక్షలు జరిగాయని ఆమె వివరించారు.
