అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Heavy Rain | ఆకాశం బద్దలైనట్లు కురిసిన భారీ వర్షానికి కామారెడ్డి (Kamareddy) పట్టణం అతలాకుతలమైంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి మొదలైన వాన ఏకధాటిగా రెండు గంటల పాటు కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
Kamareddy Heavy Rain | నిమిషాల్లోనూ రహదారులు జలమయం..
నిమిషాల్లోనే పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీల్లోని రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి వాహనాలు నెమ్మదిగా కదలడంతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం జోరుకు పట్టణంతో పాటు శివారు గ్రామాలు సైతం తడిసి ముద్దయ్యాయి. పనుల మీద కామారెడ్డికి వచ్చిన గ్రామీణ ప్రజలు అకస్మాత్తుగా వచ్చిన వర్షానికి దుకాణాలు, షాపింగ్ మాల్స్‌లో తలదాచుకున్నారు. రోడ్లపై వాహనాల రాకపోకలకు వర్షం వల్ల అంతరాయం ఏర్పడుతోంది.
Kamareddy Heavy Rain | రైతుల్లో ఆనందం..

ఒకవైపు పట్టణ ప్రజలు వర్షానికి ఇబ్బంది పడుతుంటే, మరోవైపు రైతన్నలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. గత కొద్దిరోజులుగా వర్షాలు కరువై వరి నారు ఎదుగుదల ఆగిపోయి ఆందోళన చెందిన రైతులు ఈ వానతో ఊపిరి పీల్చుకున్నారు. పొలాలు తడుస్తుండటంతో దుక్కులు దున్నేందుకు, వరినాట్లు ప్రారంభించేందుకు రైతులు సిద్ధమయ్యారు. వాతావరణం ఇలాగే సహకరిస్తే రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా వరినాట్ల సందడి మొదలుకానుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ వాన రబీకి మేలు చేస్తుందని రైతాంగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఇది కూడా చదవండి..: Police Image | పోలీస్ ఇమేజ్ను పెంచేవిధంగా సిబ్బంది వ్యవహరించాలి..:సీపీ సాయిచైతన్య