అక్షరటుడే, కామారెడ్డి: CMR Delivery Review | జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీలను వేగవంతం చేయడంతో పాటు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Kamareddy Collector Ashish Sangwan) అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సీఎంఆర్(CMR), సీజీడీ ప్రాజెక్టులపై రెండు వేర్వేరు సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
CMR Delivery Review | సీఎంఆర్ పెండింగ్‌పై కలెక్టర్ ఆందోళన
సీఎంఆర్ సమీక్షలో రబీ 2024–25, ఖరీఫ్ 2025–26, రబీ 2025–26 సీజన్లకు సంబంధించి 3,48,991 మెట్రిక్ టన్నుల బియ్యం డెలివరీ పెండింగ్‌లో ఉండటంపై కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. జూలై నెలలో కనీసం 20 రైల్వే వ్యాగన్ల ద్వారా బియ్యం తరలింపు జరిగేలా ఎఫ్‌సీఐ అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అడ్లూర్ ఎల్లారెడ్డి ఐజీ-2, ఉప్పల్‌వాయి గోదాముల్లోని స్టాక్‌కు సంబంధించిన స్థలాలను వెంటనే ఖాళీ చేయాలని, అన్‌లోడింగ్‌కు తగినంత మంది హమాలీలను ఏర్పాటు చేయాలని సూచించారు. నాణ్యత పరీక్షల్లో అన్ని కేంద్రాల్లో ఒకే విధమైన ప్రమాణాలు పాటించాలని, రోజుకు 50 సీఎంఆర్ లాట్ల లక్ష్య సాధనకు కామారెడ్డి డివిజన్‌లో నలుగురు అదనపు టెక్నికల్ అసిస్టెంట్లను నియమించాలని ఆదేశించారు.
CMR Delivery Review |రైస్‌మిల్లర్లు కూడా..
రైస్ మిల్లర్లు కూడా డెలివరీలను వేగవంతం చేసి ప్రభుత్వ లక్ష్యాలకు సహకరించాలని కోరారు. అనంతరం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టుపై(City Gas Distribution Project) సమీక్షించిన కలెక్టర్, జిల్లాలో పైప్డ్ నేచురల్ గ్యాస్, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మహారాష్ట్ర నేచురల్ గ్యాస్ లిమిటెడ్‌కు అన్ని శాఖలు పూర్తి సహకారం అందించాలన్నారు. పైప్‌లైన్ పనులకు అవసరమైన అనుమతులను 24 గంటల్లో జారీ చేయాలని, రోడ్లు, భూగర్భ యుటిలిటీల డిజిటలైజ్డ్ మ్యాపులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తవ్వకాలకు ముందు కాల్ బిఫోర్ యూ డిగ్ యాప్ తప్పనిసరి అని తెలిపారు. జిల్లా పౌర సరఫరాల అధికారిని నోడల్ అధికారిగా నియమించి, ప్రతి నెల ప్రాజెక్టు పురోగతి నివేదిక ఇవ్వాలని సూచించారు. సీఎంఆర్ నిల్వలను సకాలంలో తరలించడంతో పాటు పర్యావరణహిత సిటీ గ్యాస్ మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయడంలో అన్ని శాఖలు మిషన్ మోడ్‌లో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
