అక్షర టుడే, ఎల్లారెడ్డి: Kamareddy Damaged Bridges | గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలో అనేక రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. ఏడాది అవుతున్నా ఇప్పటికీ వాటి పునర్నిర్మాణ పనులు పూర్తి కాలేదు. దీంతో వర్షాకాలం రాగానే మళ్లీ ఆ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Kamareddy Damaged Bridges | తాత్కాలిక పనులతో సరి
గతేడాది కురిసిన భారీ వర్షాలకు కూలిన వంతెనల వద్ద మట్టిని పోసి రోలింగ్ చేశారు. తాత్కాలిక పనులతో సరిపెట్టారు. పోసిన మట్టి భారీ వర్షాలు పడితే మళ్లీ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది అవుతున్నా.. రోడ్డు పనులు ప్రారంభించకపోవడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా అధికారులు పాలకులు స్పందించి వర్షాలకు రోడ్లు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే మళ్లీ జిల్లా కేంద్రాలకు రాజధానికి రాకపోకలు బంద్ అయ్యే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Kamareddy Damaged Bridges | జిల్లాలో పరిస్థితి ఇది..
కామారెడ్డి జిల్లా (Kamareddy District)లో గతేడాది భారీ వర్షాలకు పోచారం గ్రామ సమీపంలోని ఎల్లారెడ్డి– మెదక్ రోడ్డు వంతెన కొట్టుకుపోయింది. అక్కడ తాత్కాలికంగా మళ్లీ మట్టి పోసి రాకపోకలను పునరుద్ధరించారు. వాటికి శాశ్వత మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో మళ్లీ భారీ వర్షాలు పడితే మట్టి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్ జిల్లాలకు వెళ్లే ఇదే దారి కావడం గమనార్హం. ఎల్లారెడ్డి–కామారెడ్డి రహదారిపై వడ్డెర కాలనీ, అడవి లింగాల, కొట్టాల గ్రామాల వద్ద వంతెలనపై నుండి వర్షం నీరు ఉధృతిగా ప్రవహించడం వల్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఆయా గ్రామాలకు 15 రోజులపాటు రాకపోకలు స్తంభించాయి. అప్పుడు తాత్కాలికంగా మట్టితో మళ్లీ రోడ్డును పూడ్చారు.
Kamareddy Damaged Bridges | ఎక్కడా శాశ్వత మరమ్మతులు లేవు..

ఎక్కడ కూడా శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడంతో మళ్లీ ఆ ప్రాంతాల్లో మట్టి కృంగిపోయి రోడ్డు కొట్టుకుపోయే పరిస్థితి నెలకొందని ప్రజలు పేర్కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లో భారీవర్షాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాకపోకలు కొనసాగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లింగంపల్లి వంతెన సైతం భారీవరదకు కుంగిపోయింది. కామారెడ్డికి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ తాత్కాలిక రోడ్డును వేసి రాకపోకలను పునరుద్ధరించారు. ప్రస్తుతం మళ్లీ భారీ వర్షాలు కురిస్తే రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరైన పనులు ప్రారంభం కాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
Kamareddy Damaged Bridges | సీఎం స్వయంగా పరిశీలించినా..
ఈ వంతెనను సీఎం స్వయంగా వచ్చి పరిశీలించి వెళ్లారు. ఏడాది గడిచినా పనులు ప్రారంభం పూర్తి చేయకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కామారెడ్డి పట్టణ కేంద్రంలో సైతం భారీ వరదలకు చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. వాటికి సైతం మరమ్మతులు చేయడంలో అధికారులు మొద్దు నిద్ర వహిస్తున్నారు. మళ్లీ విపత్తు రాకముందే అధికారులు, పాలకులు స్పందించి శాశ్వత పనులు జరిగేలా చూడాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి..: Bodhan Toddy Death | ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన