అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rangareddy Murders | రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. పోక్సో POCSO కేసు నమోదు చేశారన్న కక్షతో ఓ వ్యక్తి ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Rangareddy Murders | విచక్షణారహితంగా దాడి..
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. షాబాద్ మండలం దైవాలగూడ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ (28) అనే వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో అతని భార్య, ఇద్దరు చిన్నారులు, పొక్సో కేసులో బాధిత బాలిక, ఆమె తల్లి, నానమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేశ్ గౌతమ్ ఇతర పోలీసు అధికారులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రాథమిక విచారణలో పొక్సో కేసు నేపథ్యంలో ఏర్పడిన కక్షతోనే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి కదలికలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
ఈ దారుణ ఘటనతో దైవాలగూడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.