అక్షరటుడే వెబ్డెస్క్: Nellore Murder Case | డబ్బు, ఆస్తి ఆశతో ఓ బావమరిది బావను అత్యంత కిరాతకంగా చంపేశాడు. సొంత ఆస్తిని తిరిగి అడిగాడన్న కోపంతో, పక్కా ప్లాన్ వేసి హత్య చేసిన ఘటన నెల్లూరు ( Nellore ) జిల్లాలో కలకలం రేపింది. బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన ఏవో (AO) శ్రీహరికి కోట్ల విలువైన ఆస్తి ఉంది. ఈ ఆస్తిని తన బావమరిది హరికృష్ణ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించడంతో పాటు, అతనికి కొంత నగదును అప్పుగా కూడా ఇచ్చారు. అయితే, ఇటీవల శ్రీహరి తన సొంత ఇంటి నిర్మాణం కోసం, తన పేరు మీద ఉన్న ఆస్తిని , ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వాలని బావమరిదిని కోరారు. ఆస్తిని తిరిగి ఇచ్చేందుకు ఇష్టపడని హరికృష్ణ, బావను అడ్డు తొలగించుకుంటే ఆస్తులన్నీ తనకే ఉంటాయని భావించి హత్యకు స్కెచ్ వేశాడు.
Nellore Murder Case | అమాయకుడిలా నమ్మించి..
పథకం ప్రకారం, పెంచలకోన ఆలయానికి వెళ్దామని చెప్పి శ్రీహరిని తన కారులో బయటకు తీసుకెళ్లాడు. మార్గమధ్యలో తన సహచరులతో కలిసి, శ్రీహరిని అదుపులోకి తీసుకుని కుక్కలను చంపే పాయిజన్ ఇంజెక్షన్లు ఇచ్చాడు. దీనివల్ల కొద్దిసేపటికే శ్రీహరి ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం ఇది సహజ మరణం (గుండెపోటు) అని కుటుంబ సభ్యులను నమ్మించాడు.
Nellore Murder Case | బయటపడిన అసలు నిజం..
శ్రీహరి మృతదేహంపై అనుమానాస్పద గాయాలు ఉండటంతో తోటి ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కుటుంబ సభ్యులు అప్పటికే అంత్యక్రియలు పూర్తి చేశారు. అనంతరం నిందితుడు హరికృష్ణ మిగిలిన ఆస్తుల కోసం కుటుంబ సభ్యులను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో అనుమానం వచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా, హరికృష్ణ చేసిన దారుణం బయటపడింది. నిందితుడితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు, హత్యకు సహకరించిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: BRS Blood Donation | సీఎం రేవంత్ రెడ్డికి రక్తదానం.. బీఆర్ఎస్ నిరసనతో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత