అక్షరటుడే, కామారెడ్డి: SIR Process | ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటర్ల ఎన్యుమరేషన్‌ను సకాలంలో పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ (Election Commission) ఆదేశించడంతో ఉమ్మడి జిల్లాలో బీఎల్వోలు, అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఫారాలు సకాలంలో చేరకపోవడం, చేరినా నింపడంలో ఇబ్బందులు, ప్రభుత్వ సిబ్బంది సహకారం లేకపోవడంతో ఈ ప్రక్రియ విజయవంతమవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
SIR Process | ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రక్రియ వేగంగా పూర్తి చేయడానికి సర్పంచులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. పట్టణాల్లోకి వచ్చేసరికి మాత్రం ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ముఖ్యంగా ఓటర్ల చిరునామాలు అనేక మార్లు మారడంతో ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతోంది.
SIR Process | చేరని ఫారాలు, నింపలేని పరిస్థితి..
గ్రామాల్లో ఫారాలు అందినా పట్టణాల్లో ఇంకా చాలామందికి అందలేదు. సిబ్బంది కొరత, పెద్ద కాలనీలు ఉండటంతో బీఎల్వోలు ఇంటింటికి వెళ్లలేకపోతున్నారు. కొన్నిచోట్ల ఒకే కుటుంబంలో కొందరికే ఫారాలు ఇచ్చి మిగిలిన వారిని వదిలేస్తున్న ఘటనలున్నాయి. ఫారాలు అందినా వాటిని నింపడంలో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఫారంలో అడిగే వివరాలు, జత చేయాల్సిన పత్రాలపై స్పష్టత లేదు. వృద్ధులు, చదువు రానివారు బీఎల్వోలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఫారం ఇచ్చారు కానీ ఏం రాయాలో చెప్పడం లేదని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
SIR Process | ఉద్యోగుల నిరాకరణ, బీఎల్వోలపై ఒత్తిడి
ఈ ప్రక్రియలో సహకరించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అదనపు పని అంటూ నిరాకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో బీఎల్వోలపై పనిభారం పెరిగి టార్గెట్ పూర్తి చేయడంలో జాప్యం జరుగుతోంది. మరోవైపు విధులు నిర్వర్తిస్తున్న బీఎల్వోలపై కొందరు ఓటర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ‘మా ఇంటికే వచ్చి ఫారం ఇవ్వాలి’ అంటూ ఫోన్లలో బెదిరిస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. అడ్రస్ తెలియక రాలేకపోతున్నామని చెప్పినా సహకరించడం లేదని బీఎల్వోలు వాపోతున్నారు.
SIR Process | డెడ్‌లైన్ లోపు పూర్తయ్యేనా..!
ఓటర్ జాబితా ఎన్యుమరేషన్ ప్రక్రియను ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఈనెల 24వ తేదీలోపు ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఓటర్ల ఆవేదన, బీఎల్వోలపై ఒత్తిడి, చదువుకున్న వాళ్లు సైతం ఎన్యుమరేషన్ ఫారం నింపలేని స్థితిలో బీఎల్వోలపై భారం మోపడంతో ప్రక్రియ పూర్తి అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కామారెడ్డి పట్టణంలో ఇద్దరు ఓటర్లు బీఎల్వోలపై దాడి చేయడంతో మిగతా బీఎల్వోలు సైతం భయపడే పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు లేకున్నా పట్టణాల్లో వివిధ రకాల మైండ్‌సెట్ ఉన్న కొంతమంది వ్యక్తులను కలిసి వారిని సముదాయించడం బీఎల్వోలకు కష్టంగా మారుతోంది. మెజారిటీ ప్రజలు బీఎల్వోలకు సహకరించడంతో ఇబ్బందులను దాటుకుని ముందుకు సాగుతున్నారు.
SIR Process | కీలకంగా మారిన 2002 డేటా..

ఎన్యుమరేషన్లో 2002 బేస్ ఇయర్ జాబితా ప్రామాణికంగా ఉంది. ఓటర్లు తమ వివరాలను voters.eci.gov.in లేదా ceotelangana.nic.in వెబ్సైట్లలో Year 2002 సెలెక్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ రానివారు తహశీల్దార్ ఆఫీస్‌లో హార్డ్ కాపీ చూడొచ్చు. 1950 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి కూడా వివరాలు పొందవచ్చు. బీఎల్వోల వద్ద కూడా ఓటర్ జాబితా వివరాలు అందుబాటులో ఉంటాయి.
SIR Process | 2002 జాబితా బీఎల్వోల వద్ద ఉంది
– హిమబిందు, తహసీల్దార్, కామారెడ్డి
2002లో ఓటు వేసి ఉంటే సంబంధిత ఓటరు జాబితా బీఎల్వోల వద్ద, ఎలక్షన్ వెబ్సైట్లో ఉంటుంది. బీఎల్వోల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఫారాలు రాలేవని మాపైనే అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఫారం ఫిలప్ చేయకపోవడం బాధాకరం. వాళ్ల ఫారాలు కూడా మేమే ఫిలప్ చేస్తున్నాం. ఎవరిని ప్రశ్నించే స్థితిలో లేము. పని త్వరగా పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.
ఇది కూడా చదవండి..: Municipal Waterman | మున్సిపల్ వాటర్‌మన్‌కు పాముకాటు.. ఆస్పత్రిలో చికిత్స..