అక్షరటుడే, ఇందూరు: Booth Level Agents | బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం విషయంలో రాజకీయ పార్టీలు జాప్యం చేయకుండా నిర్ణీత ఫార్మాట్లో పేర్లను అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision) ప్రక్రియ అమలులో బీఎల్ఏల పాత్ర ఎంతో కీలకమని వారి నియామకంలో తాత్సారం చేయవద్దన్నారు. కలెక్టరేట్లో అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్వోల, ఏఈఆర్వోలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
Booth Level Agents | పారదర్శకతతో కూడిన ఓటరు జాబితా
పారదర్శతతో కూడిన ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్ఐఆర్ను అమలు చేస్తోందని కలెక్టర్ అన్నారు. ఈ మేరకు నిర్ణీత షెడ్యూల్ను కూడా వెలువరించిందని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘంచే గుర్తింపు కలిగిన అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలన్నారు. నిర్ణీత ఫార్మాట్లో వారి వివరాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ఈఆర్వోలను ఆదేశించారు. బీఎల్ఏల నియామకం కోసం ఇప్పటికే రాజకీయ పార్టీలను లిఖిత పూర్వకంగా కోరినప్పటికీ, ఇంకా వివరాలు అందించలేదన్నారు.
కేవలం ఒక పార్టీ మాత్రమే రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బీఎల్ఏల(BLO) వివరాలు సమర్పించిందని తెలిపారు. ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ అమలుకు సంబంధించి బీఎల్ఏలకు శిక్షణ తరగతులు నిర్వహించాల్సి ఉందని, అంతేకాకుండా ముసాయిదా ఓటరు జాబితాలోని అంశాలపై ఏవైనా అభ్యంతరాలుంటే, బీఎల్ఏలు వాటిని ప్రస్తావించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
Booth Level Agents | ఈఆర్వోలు పార్టీలతో సమావేశమవ్వాలి
ఈఆర్వోల స్థాయిలో ప్రతివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు తీరు గురించి వారికి వివరాలు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో బీఎల్వోలు ప్రతి ఇంటిని సందర్శించి ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు. బీఎల్వోలకు సహకారం అందించేందుకు వీలుగా వలంటీర్లను సమకూర్చాలన్నారు. చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిపోయిన, రెండు చోట్ల పేర్లు కలిగిన ఓటర్లను మ్యాపింగ్ సందర్భంగా కచ్చితంగా గుర్తించేలా చూడాలన్నారు. తప్పులు లేకుండా ఎన్యుమరేషన్ ఫారం ఎలా నింపాలనే దానిపై బీఎల్వోలకు సమగ్రంగా అర్ధమయ్యే రీతిలో శిక్షణ అందించాలని ఆదేశించారు.
అన్ని పోలింగ్ బూత్ల పరిధిలో వీఐపీలు, వీవీఐపీ ఓటర్లు ఉంటే, వారి మ్యాపింగ్ పూర్తయ్యిందా లేదా అన్నది ఈఆర్వోలు స్వయంగా పరిశీలన జరపాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్మూర్ (Armoor) సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ (Nizamabad) ఆర్డీవో రాజేంద్రకుమార్, బాన్సువాడ (Banswada) ఆర్డీవో రవీందర్ రెడ్డి, బోధన్ ఆర్డీవో విజయ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఏఈఆర్వోలు పాల్గొన్నారు.




