Heavy Rain Alert | రానున్న రోజుల్లో ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు.. ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Heavy Rain Alert | తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం గత 24 గంటల్లో కామారెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది.

Heavy Rain Alert | అల్పపీడనం పశ్చిమంగా..

చత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దులో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం పశ్చిమంగా కదులుతుండడంతో రాగల 48 గంటల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. బుధవారం కామారెడ్డి జిల్లాలో ఎల్లో అలర్ట్, నిజామాబాద్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ రెండు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గురువారం కామారెడ్డి, నిజామాబాద్ రెండు జిల్లాల్లోనూ ఆరెంజ్ అలర్ట్ కొనసాగనుంది. శుక్రవారం నుంచి వర్షాల తీవ్రత కొంత తగ్గినా రాష్ట్రవ్యాప్తంగా ఈదురు గాలులు 30 నుంచి 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది. రైతులు పొలాల్లోకి వెళ్లే ముందు వాతావరణ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Heavy Rain Alert | జిల్లాలో భారీ వర్షాలు, మెరుపుల హెచ్చరిక

రాబోయే రోజుల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే అత్యంత ప్రాధాన్యమని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ అధికార యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. వర్షాల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నదులు, వాగులు, చెరువులు, కాలువలు వంటి నీటి ప్రవాహ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, వరద నీటిని దాటే ప్రయత్నం చేయడం ప్రమాదకరమని కలెక్టర్ హెచ్చరించారు. వర్షాల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, తెగిపోయిన విద్యుత్ తీగల సమీపంలో ఉండరాదని, మెరుపులు పడే అవకాశం ఉన్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా నిలబడకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని, రహదారులు జారుడు స్వభావం కలిగి ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.

Heavy Rain Alert | ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ పెట్టాలి..

కలుషితమైన ఆహారం, తాగునీటిని ఉపయోగించకుండా ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లా అత్యవసర నియంత్రణ కేంద్రాన్ని 24 గంటలు పనిచేసేలా ఏర్పాటు చేసినట్లు, అవసరమైన సహాయక చర్యలకు అన్ని శాఖలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. వరదలు, భారీ వర్షాల వల్ల ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినా వెంటనే స్పందించేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు రహదారుల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని, పోలీసు శాఖ ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు చర్యలు చేపట్టాలన్నారు. పంచాయతీరాజ్ అధికారులు గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గొర్రెల కాపరులు, పశుపోషకులు తమ పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే గ్రామ, మండల అధికారులకు లేదా జిల్లా నియంత్రణ కేంద్రానికి సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు. అత్యవసర సమయంలో జిల్లా నియంత్రణ కేంద్రం 8468220069, పోలీస్ కంట్రోల్ రూమ్ 100, అగ్నిమాపక శాఖ 101 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Rainfall | కామారెడ్డిలో విస్తారంగా వర్షాలు.. ఊపందుకున్న సాగు పనులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *