అక్షరటుడే, ఇందూరు: SRSP Eco Tourism | తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TG FDC) ఆధ్వర్యంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (SRSP) బ్యాక్‌వాటర్ పరిధిలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా పర్యాటకాన్ని పెంపొందించడమే కాకుండా, స్థానిక నిరుపేద యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా అధికారులు ఒక కీలక కార్యక్రమాన్ని చేపట్టారు.
SRSP Eco Tourism | నిర్మాణ్ ఎన్‌జీవో భాగస్వామ్యంతో..
ఈ బృహత్తర ప్రాజెక్టును విజయవంతం చేయడం కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (NITHM), ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘నిర్మాణ్’ (Nirman NGO) భాగస్వామ్యంతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా మొదటి విడతగా చిన్నాయనం గ్రామానికి చెందిన తొమ్మిది మంది నిరుపేద యువకులను ఎంపిక చేసి, వారికి హైదరాబాద్‌లో 15 రోజుల పాటు వసతితో కూడిన ప్రత్యేక వృత్తి నైపుణ్యాల శిక్షణను అందించారు.
SRSP Eco Tourism | శిక్షణలో నేర్పిన అంశాలివే..
సందర్శకులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించడాన్ని.. వారి అవసరాలను గుర్తించి ఉత్తమ సేవలు అందించడంపై శిక్షణ ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులతో సమర్థవంతంగా, మృదువుగా మాట్లాడే విధానంపై అవగాహన కల్పించారు. రుచికరమైన వంటకాలు చేయడం, వంటగదిని అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పరిశుభ్రంగా ఉంచడంపై అనుభవజ్ఞులతో శిక్షణ అందించారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ప్రకృతిని కాపాడుతూ, నైతిక విలువలతో టూరిజం నిర్వహించడం వంటి అంశాలు వివరించారు.
SRSP Eco Tourism | గైడ్‌లు.. హాస్పిటాలిటీ సిబ్బందిగా ఉపాధి

త్వరలోనే ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ ప్రాంతంలో ప్రారంభం కానున్న ఎకో టూరిజం ప్రాజెక్టులో శిక్షణ పొందిన ఈ యువకులను గైడ్‌లుగా, హాస్పిటాలిటీ సిబ్బందిగా నియమించనున్నారు. దీని ద్వారా పర్యాటకులకు అద్భుతమైన, మరపురాని అనుభూతిని అందించడమే లక్ష్యం తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కృషి చేస్తోంది. ఈ కార్యక్రమంతో స్థానిక యువతకు స్థిరమైన ఉపాధి లభించడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల స్థిరమైన అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు, ఎకో టూరిజం ప్రమోషన్‌కు ఎంతో ఊతం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Jajala Surender Arrest | మాజీ ఎమ్మెల్యే జాజాల అరెస్ట్.. సాధారణ వ్యక్తిలా బైక్‌పై వచ్చి నిరసన