SIR Process | ‘సర్’ సక్సెస్​కు ఆటంకాలెన్నో..! నత్తనడకన సాగుతున్న ప్రక్రియ

ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటర్ల ఎన్యుమరేషన్‌ను సకాలంలో పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఉమ్మడి జిల్లాలో బీఎల్​వోలు, అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: SIR Process | ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటర్ల ఎన్యుమరేషన్‌ను సకాలంలో పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ (Election Commission) ఆదేశించడంతో ఉమ్మడి జిల్లాలో బీఎల్​వోలు, అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఫారాలు సకాలంలో చేరకపోవడం, చేరినా నింపడంలో ఇబ్బందులు, ప్రభుత్వ సిబ్బంది సహకారం లేకపోవడంతో ఈ ప్రక్రియ విజయవంతమవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

SIR Process | ఉమ్మడి జిల్లాలో..

ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రక్రియ వేగంగా పూర్తి చేయడానికి సర్పంచులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. పట్టణాల్లోకి వచ్చేసరికి మాత్రం ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ముఖ్యంగా ఓటర్ల చిరునామాలు అనేక మార్లు మారడంతో ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతోంది.

SIR Process | చేరని ఫారాలు, నింపలేని పరిస్థితి..

గ్రామాల్లో ఫారాలు అందినా పట్టణాల్లో ఇంకా చాలామందికి అందలేదు. సిబ్బంది కొరత, పెద్ద కాలనీలు ఉండటంతో బీఎల్​వోలు ఇంటింటికి వెళ్లలేకపోతున్నారు. కొన్నిచోట్ల ఒకే కుటుంబంలో కొందరికే ఫారాలు ఇచ్చి మిగిలిన వారిని వదిలేస్తున్న ఘటనలున్నాయి. ఫారాలు అందినా వాటిని నింపడంలో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఫారంలో అడిగే వివరాలు, జత చేయాల్సిన పత్రాలపై స్పష్టత లేదు. వృద్ధులు, చదువు రానివారు బీఎల్​వోలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఫారం ఇచ్చారు కానీ ఏం రాయాలో చెప్పడం లేదని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

SIR Process | ఉద్యోగుల నిరాకరణ, బీఎల్​వోలపై ఒత్తిడి

ఈ ప్రక్రియలో సహకరించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అదనపు పని అంటూ నిరాకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో బీఎల్​వోలపై పనిభారం పెరిగి టార్గెట్ పూర్తి చేయడంలో జాప్యం జరుగుతోంది. మరోవైపు విధులు నిర్వర్తిస్తున్న బీఎల్​వోలపై కొందరు ఓటర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ‘మా ఇంటికే వచ్చి ఫారం ఇవ్వాలి’ అంటూ ఫోన్లలో బెదిరిస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. అడ్రస్ తెలియక రాలేకపోతున్నామని చెప్పినా సహకరించడం లేదని బీఎల్​వోలు వాపోతున్నారు.

SIR Process | డెడ్​లైన్ లోపు పూర్తయ్యేనా..!

ఓటర్ జాబితా ఎన్యుమరేషన్ ప్రక్రియను ఎన్నికల కమిషన్ సీరియస్​గా తీసుకుంది. ఈనెల 24వ తేదీలోపు ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఓటర్ల ఆవేదన, బీఎల్​వోలపై ఒత్తిడి, చదువుకున్న వాళ్లు సైతం ఎన్యుమరేషన్ ఫారం నింపలేని స్థితిలో బీఎల్​వోలపై భారం మోపడంతో ప్రక్రియ పూర్తి అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కామారెడ్డి పట్టణంలో ఇద్దరు ఓటర్లు బీఎల్​వోలపై దాడి చేయడంతో మిగతా బీఎల్​వోలు సైతం భయపడే పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు లేకున్నా పట్టణాల్లో వివిధ రకాల మైండ్​సెట్ ఉన్న కొంతమంది వ్యక్తులను కలిసి వారిని సముదాయించడం బీఎల్​వోలకు కష్టంగా మారుతోంది. మెజారిటీ ప్రజలు బీఎల్​వోలకు సహకరించడంతో ఇబ్బందులను దాటుకుని ముందుకు సాగుతున్నారు.

SIR Process | కీలకంగా మారిన 2002 డేటా..

SIR Process

ఎన్యుమరేషన్‌లో 2002 బేస్ ఇయర్ జాబితా ప్రామాణికంగా ఉంది. ఓటర్లు తమ వివరాలను voters.eci.gov.in లేదా ceotelangana.nic.in వెబ్‌సైట్లలో Year 2002 సెలెక్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రానివారు తహశీల్దార్ ఆఫీస్‌లో హార్డ్ కాపీ చూడొచ్చు. 1950 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి కూడా వివరాలు పొందవచ్చు. బీఎల్​వోల వద్ద కూడా ఓటర్ జాబితా వివరాలు అందుబాటులో ఉంటాయి.

SIR Process | 2002 జాబితా బీఎల్​వోల వద్ద ఉంది

– హిమబిందు, తహసీల్దార్, కామారెడ్డి
2002లో ఓటు వేసి ఉంటే సంబంధిత ఓటరు జాబితా బీఎల్​వోల వద్ద, ఎలక్షన్ వెబ్‌సైట్‌లో ఉంటుంది. బీఎల్​వోల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఫారాలు రాలేవని మాపైనే అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఫారం ఫిలప్ చేయకపోవడం బాధాకరం. వాళ్ల ఫారాలు కూడా మేమే ఫిలప్ చేస్తున్నాం. ఎవరిని ప్రశ్నించే స్థితిలో లేము. పని త్వరగా పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.

ఇది కూడా చదవండి..: Municipal Waterman | మున్సిపల్ వాటర్​మన్​కు పాముకాటు.. ఆస్పత్రిలో చికిత్స..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *