అక్షరటుడే, భీమ్‌గల్ (వేల్పూర్) : Balkonda constituency | బాల్కొండ (Balkonda) నియోజకవర్గ పరిధిలోని భీమ్‌గల్ (Bheemgal) పట్టణ అభివృద్ధి అంశం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. పట్టణ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని ఆరోపిస్తూ బుధవారం ఒకరోజు నిరాహార దీక్షకు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
Balkonda constituency | ఎమ్మెల్యే గృహనిర్బంధం..
పోలీసులు వేకువజామునే ఎమ్మెల్యే గృహనిర్బంధం చేశారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో నియోజకవర్గంలో రాజకీయ సెగ ఒక్కసారిగా పెరిగింది. బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేశారని.. అభివృద్ధి పనులకు నిధులివ్వట్లేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి(Mla Prashanth reddy) ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన ఒకరోజు ‘కఠోర నిరాహార దీక్ష’ చేస్తానని ప్రకటించారు. అయితే బుధవారం తెల్లవారుజామున ఆయన ఆయన ఇంటి చుట్టూ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. దీనికి ఎమ్మెల్యే స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అంత భయమని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గృహనిర్బంధంలో ఉన్నప్పటికీ ఆయన తన నిరసనను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Balkonda constituency | ఎమ్మెల్యే ప్రధాన డిమాండ్లు..
బీఆర్ఎస్ హయాంలో భీమ్‌గల్ ప్రజల కోసం 100 పడకల ఆస్పత్రికి మంజూరు చేసి, 70 శాతానికి పైగా పనులు పూర్తి చేశామని.. మిగిలిన పనులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వేముల ఆరోపించారు. గతంలో తాము ఎంతో శ్రమించి తీసుకొచ్చిన బస్ డిపోను కాంగ్రెస్ సర్కార్ మూసివేసిందని.. దానిని తక్షణమే పునరుద్ధరించాలన్నారు. సీసీ రోడ్ల కోసం రూ. 12 కోట్లు మంజూరు చేస్తే, మున్సిపల్ ఎన్నికల లబ్ధి కోసం కాంగ్రెస్ నేతలు కొబ్బరికాయలు కొట్టి పనులను కంకర వేసి వదిలేశారని.. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయని పేర్కొన్నారు.
Balkonda constituency | పోలీసులకు అంతా ఉత్సాహమెందుకు..
దీక్షకు ముందస్తు అనుమతి కోరినా, వేకువజామునే ఇల్లు ముట్టడించి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమ్‌గల్‌లో దీక్షా శిబిరాన్ని కూల్చేసి, టెంట్లు, ఫ్లెక్సీలు చించేయడం ప్రభుత్వ రాక్షసత్వానికి నిదర్శనమని ఆరోపించారు. మూడు నెలల్లో ఆస్పత్రి తెరిపిస్తామని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఐదు నెలలైనా ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. తనను ఇంట్లో నిర్బంధించినా, జైల్లో పెట్టినా పోరాటాన్ని ఆపేది లేదని భీష్మించారు. భీమ్‌గల్ అభివృద్ధి పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇచ్చే వరకు నా సత్యాగ్రహం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
Balkonda constituency | కార్యకర్తల అరెస్టులతో ఉద్రిక్తత
భీమ్‌గల్ నిరాహార దీక్షకు మద్దతుగా నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు, అరెస్టులు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తున్న వారిని అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధమని, ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ కమలాకర్, ఇతర నేతలు ఆరోపించారు. ఒకవైపు సవాల్ ప్రతిసవాళ్లు, మరోవైపు అరెస్టుల పర్వంతో బుధవారం బాల్కొండ నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. అయితే అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయకుండా ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారంటూ మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి ఎదురుదాడికి దిగారు.
ఇది కూడా చదవండి: కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న #KA13 టీం స్పెషల్ వీడియో రిలీజ్