Bheemgal Political Row | ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి కనీస బాధ్యత మరిచారు..: ముత్యాల సునీల్​రెడ్డి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్​ఛార్జీ సునీల్​కుమార్​ విమర్శలు చేశారు. భీమ్​గల్ అభివృద్ధికి ఆయన అడ్డంకిగా మారారన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్​గల్‌ : Bheemgal Political Row | మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy) తాను ఒక శాసనసభ్యుడిననే విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్లున్నారని, కనీస బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని బాల్కొండ(Balkonda) నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్​ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ ధ్వజమెత్తారు. భీమ్​గల్​ మండల కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Bheemgal Political Row | ఆస్పత్రి, మార్కెట్ నిర్మాణాల్లో గత ప్రభుత్వ మోసాలు

కేవలం ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కుట్రతోనే ఆయన వ్యవహరిస్తున్నారని, ఆయనకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ముత్యాల సునీల్​ రెడ్డి హెచ్చరించారు. 2022 జూన్ 18న రూ.35 కోట్ల అంచనా వ్యయంతో పది పడకల ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మార్చేందుకు అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావును పిలిపించి ప్రశాంత్ రెడ్డి భూమి పూజ చేశారన్నారు. కేవలం ఎనిమిది నెలల్లోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చి, పైసా నిధులు ఇవ్వకుండా ప్రజలను మోసగించారని మండిపడ్డారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఈ ఆస్పత్రి పూర్తి చేయడానికి రూ.3 కోట్ల నిధులను మంజూరు చేయించారన్నారు. అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.

Bheemgal Political Row | బీఆర్​ఎస్​ హయాంలోనే నిధులివ్వలేదు

అలాగే 2021లో శంకుస్థాపన చేసిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్​కు టీయూఎఫ్ఐడీసీ, ప్రత్యేక నిధుల నుండి రూ.3 కోట్లు కేటాయించామని చెప్పి, నయా పైసా బిల్లు కూడా చెల్లించలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో చేసిన పనుల బిల్లులన్నీ పెండింగ్‌లో పెట్టడం వల్ల, కమీషన్ల భయానికి కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రావట్లేదన్నారు. భీమ్​గల్​ అభివృద్ధికి ప్రశాంత్ రెడ్డే ప్రధాన అడ్డంకిగా మారారని ఆరోపించారు.

గతంలో రవాణా శాఖ మంత్రిగా ఉండి కూడా ప్రశాంత్ రెడ్డి భీమ్​గల్​ బస్ డిపోను తెరిపించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఆర్మూర్ నుండి నాలుగు బస్సులను తెచ్చి పార్కింగ్ చేసి, దాన్నే బస్ డిపోగా కలరింగ్ ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎన్నడూ బస్ డిపో తెరిపిస్తామని దొంగ మాటలు చెప్పలేదని, నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయానికి భీంగల్ అభివృద్ధి కోసం మంజూరు చేసిన రూ.54 కోట్ల నిధులే నిదర్శనమన్నారు.

Bheemgal Political Row | రైతులపై రాజకీయం చెల్లదు..

యూరియా యాప్ విషయంలోనూ, నీళ్ల విషయంలోనూ రైతులను రెచ్చగొట్టి ప్రశాంత్ రెడ్డి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని సునీల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎస్సారెస్పీలో 25 టీఎంసీల నీళ్లున్నా, లీకేజీ నీళ్లు అడిగిన పాపానికి బాల్కొండ నియోజకవర్గ రైతుల మీద కేసులు పెట్టించిన నల్లటి చరిత్ర ప్రశాంత్ రెడ్డిదని గుర్తు చేశారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవనం పేరుతో కమీషన్లు మింగిన ఆయన, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క టీఎంసీ నీటినైనా ఎస్సారెస్పీలో నింపారా అని ప్రశ్నించారు.

ప్రశాంత్ రెడ్డి గుండెల మీద చేయి వేసుకుని ప్రజలకు నిజం చెప్పాలని, ఆయన కట్టిన చెక్ డ్యాంల లాగానే పునరుజ్జీవన పథకం కూడా ఒక ‘డూప్లికేట్ ఇంజినీర్’ నిర్వాకంలా మిగిలిపోయిందన్నారు. రైతులను నిండా ముంచిన ఆయన దొంగ మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, ఇకనైనా డ్రామాలు ఆపి బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా నడుచుకోవాలని హితవు పలికారు. ఈ మీడియా సమావేశంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

balkonda

ఇది కూడా చదవండి: కెనడాలో కార్చిచ్చు 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *