CCTNS 2.0 Training | సాంకేతికతతోనే సేవలు వేగం: ఎస్పీ రాజేష్ చంద్ర

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి వేగంగా, పారదర్శకంగా న్యాయం అందించాలంటే సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాల్సిందేనని ఎస్పీ రాజేష్ చంద్ర స్పష్టం చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: CCTNS 2.0 Training | పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి వేగంగా, పారదర్శకంగా న్యాయం అందించాలంటే సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాల్సిందేనని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) స్పష్టం చేశారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో సీసీటీఎన్ఎస్-2.0తో పాటు ఇతర ఆధునిక పోలీసింగ్ యాప్‌లపై జిల్లా స్థాయి రైటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

CCTNS 2.0 Training | కేసుల విచారణలో పొరపాటు లేకుండా..

ఆధునిక సాఫ్ట్‌వేర్లపై పూర్తి అవగాహన ఉంటేనే కేసుల దర్యాప్తులో నాణ్యత పెరుగుతుందని, దాని ద్వారానే ప్రజల్లో పోలీసులపై నమ్మకం బలపడుతుందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసుల విచారణలో చిన్న పొరపాటు కూడా పెద్ద ఇబ్బందులకు దారితీస్తుందని గుర్తు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన క్షణం నుంచి చార్జ్‌షీట్ దాఖలు చేసే వరకు ప్రతి వివరాన్ని కచ్చితంగా, సమగ్రంగా నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా సాక్షులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు కేసు భవిష్యత్తును నిర్ణయిస్తాయని, అందులో ఎలాంటి అలసత్వం వద్దన్నారు.

CCTNS 2.0 Training | ప్రజలకు త్వరగా సేవలు

మారుతున్న కాలానికి అనుగుణంగా తెలంగాణ పోలీస్ శాఖ అందుబాటులోకి తెచ్చిన సీసీటీఎన్ఎస్-2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, టీఎస్-కాప్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్ పోర్టల్, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ వంటి సాంకేతిక సాధనాలను రోజువారీ విధుల్లో భాగంగా వాడాలని తెలిపారు. వీటిని సరిగ్గా వాడితే దర్యాప్తు సమయం తగ్గుతుందని, ప్రజలకు సేవలు త్వరగా అందుతాయని పేర్కొన్నారు. బాధితుడికి సమయానికి న్యాయం జరిగినప్పుడే చట్టంపై, వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని, ఆ విశ్వాసాన్ని కాపాడటం ప్రతి పోలీసు అధికారి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్​తో పాటు పలువురు ఉన్నతాధికారులు, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల రైటర్లు, సీఐ, డీఎస్పీ కార్యాలయాల సిబ్బంది ఈ శిక్షణలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Municipality Scam | కామారెడ్డి మున్సిపాలిటీ బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు: కౌన్సిలర్ల ఫిర్యాదు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *