అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bhatti Vikramarka | ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దీంతో భవిష్యత్తులో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సరఫరాలో అంతరాయాలు రాకుండా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ (Hyderabad)లోని ఎస్పీడీసీఎల్ (SPDCL) కార్యాలయంలో శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా తాగునీటి అవసరాలకు, సాగుకు ఎటువంటి ఆటంకం కలగకుండా అవసరమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల వసుళ్ళపై దృష్టి సారించాలని, రెవెన్యూ వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
Bhatti Vikramarka | అంగన్వాడీలకు సోలార్ విద్యుత్
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు దశలవారీగా సోలార్ విద్యుత్ సదుపాయం కల్పించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని కొండాపూర్ (Kondapur), గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో భూమి కొరత దృష్ట్యా ఫ్లైఓవర్ల కింద సబ్స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నారు. 108 తరహాలో ప్రారంభించిన ‘పవర్ అంబులెన్స్’ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని భట్టి విక్రమార్క సూచించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆధునిక సాంకేతికతను అనుసంధానించడం ద్వారా పారదర్శక సేవలు అందించవచ్చని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, సింగరేణి, జెన్కో, డిస్కంల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : HYDRAA | హైడ్రా భారీ ఆపరేషన్లు.. రూ.30 వేల కోట్ల విలువైన భూములకు ఫెన్సింగ్