KTR Warning | యువత, రైతులు కలిసి కాంగ్రెస్‌ను తన్ని తరిమేస్తారు: కేటీఆర్

యువత చేతిలో ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి పట్టిన గతే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: KTR Warning | యువత చేతిలో ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి పట్టిన గతే, తెలంగాణలో ( Telangana )కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. యువతను మోసం చేసిన కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు తరిమికొడతారని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర యువత తిరగబడితే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా బయటికి రాలేరని హెచ్చరించారు. తెలంగాణ రైతన్నలు, యువతరం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన్ని తరిమేస్తారని, ఆ తర్వాతే కేసీఆర్ ఆధ్వర్యంలో రైతు ప్రభుత్వం తిరిగి వస్తుందని స్పష్టం చేశారు.

KTR Warning | కాంగ్రెస్ సృష్టించిన కరువు..

రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతాంగం అష్టకష్టాలు పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కరువు అని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పంటల కొనుగోలు కేంద్రాల వద్ద నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వంలో స్పందన లేదని విమర్శించారు. రైతు కుటుంబాలను ఆదుకోవాలని బీఆర్ఎస్ ఎనిమిది గంటలపాటు ధర్నా చేసినా ప్రభుత్వ మనసు కరగలేదన్నారు. రెండున్నర నెలలు గడిచినా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ తరఫున మరణించిన నలుగురు రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశామని గుర్తుచేశారు. అంతేకాకుండా, కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘రైతుబీమా’ ద్వారా కూడా ప్రతి రైతు కుటుంబానికి రూ. 5 లక్షలు అందాయని తెలిపారు. నలుగురు రైతులు చనిపోయినా సీఎం రేవంత్ రెడ్డికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు.

KTR Warning | ముంచేస్తున్న రేవంత్ రెడ్డి విధానాలు..

షాపుల్లో స్వేచ్ఛగా దొరికే యూరియాను యాప్ ద్వారా మాత్రమే ఇస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఓటేసిన పాపానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిలువునా కాటేస్తోందని ఆరోపించారు. నాలుగు విడతల రైతుబంధు నిధులను ఎగ్గొట్టి రైతులను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారు. కరువుకు శాశ్వత పరిష్కారమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. గోదావరిలో నీళ్లు సమృద్ధిగా ఉన్నప్పటికీ వాటిని ఎత్తిపోసే చర్యలు ప్రభుత్వం చేపట్టడం లేదన్నారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే దుర్బుద్ధితోనే రేవంత్ రెడ్డి కావాలనే కాళేశ్వరాన్ని వినియోగించకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గోదావరి నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి:  Telangana Reservoirs | అడుగంటిన ప్రాజెక్ట్​లు.. ఆందోళనలో రైతన్నలు..

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *