అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nirmala Sitharaman | కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) నిరసనపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఇది దేశంలోని విద్యార్థులు, యువతకు సంబంధించిన విషయం అన్నారు.ప్రశ్నపత్రాల లీకేజీ, తిరిగి పరీక్ష నిర్వహించడం వంటి అంశాలు అత్యంత సున్నితమైనవని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే లేదా బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే, ప్రతిపక్షం ఇలా తీవ్రంగా విమర్శించడం సరైందే అన్నారు.
అయితే తమ ప్రభుత్వం ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుందని ఆమె గుర్తు చేశారు. ప్రశ్నాపత్రాలను లీక్ చేసిన వారిని అరెస్ట్ చేశామన్నారు. వాటిని కొనుగోలు చేసిన వారిని సైతం గతంలోనే జైలుకు పంపినట్లు గుర్తు చేశారు. అంతేగాకుండా లీకేజీలపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారన్నారు.
Nirmala Sitharaman | అడ్డుకుంటున్న కాంగ్రెస్
అనుమతి లేకుండా ఎల్‌కేఎం వద్ద కూర్చుని నిరసన తెలుపుతున్న వారి వద్దకు మంత్రులను పంపడానికి ప్రభుత్వం ముందుకొచ్చినప్పుడు, సభలో చర్చ జరగాలన్నది కాంగ్రెస్ షరతు పెట్టిందన్నారు. దానికి ప్రభుత్వం వెంటనే అంగీకరించిందని ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం సభలో సమగ్ర చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ, మరిన్ని షరతులు విధిస్తూ సభ కార్యకలాపాలకు కాంగ్రెస్, ఇండియా కూటమి ఆటంకం కలిగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ అంశాన్ని, విద్యార్థుల మనోభావాలను వాడుకుంటూ కాంగ్రెస్ తమకు అలవాటైన పనే చేస్తోందన్నారు. అదే సభకు అంతరాయం కలిగించడం అని పేర్కొన్నారు.
చర్చ జరిగితే వాస్తవాలు బయటపడతాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ వెలుగులోకి వస్తాయి. కాబట్టి వారికి ఇక నిరసన కొనసాగించడానికి ఎటువంటి కారణం లేదని తెలిపారు. వారికి అది ఇష్టం లేకపోవడంతో సభకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలు బయటపడితే యువతకు సంబంధించిన సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నది ఎవరనేది తెలిసి పోతుందన్నారు. చర్చలో పాల్గొనాలని ఆమె ప్రతిపక్షాలను కోరారు.
ఇది కూడా చదవండి..: Stock Market Crash | మార్కెట్‌ను వీడని నష్టాలు.. నాలుగో రోజూ నేలచూపులే