అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CPS Employees Rally | సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (Old Pension Scheme) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ‘తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్’ (TSCPSEU) చేపట్టిన ‘జన జాగరణ యాత్ర’ 12వ రోజు నిజామాబాద్ (Nizamabad) నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు ఉద్యోగులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
CPS Employees Rally | ఎమ్మెల్యేకు వినతిపత్రం..
అనంతరం అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తాను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీపీఎస్ ఉద్యోగుల డిమాండ్ న్యాయమైనదని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై మాట్లాడడంతో పాటు పాత పెన్షన్ పునరుద్ధరణకు సీఎంకి లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. అనంతరం టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. ఉద్యోగుల ప్రాణ్ (PRAN) ఖాతాల నుంచి నెలకు రూ.200 కోట్ల ప్రజాధనం మార్కెట్ రిస్క్‌లకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోనూ పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల శ్రీకాంత్, జిల్లా నాయకులు విక్రమ్ సింగ్, గోపాల్, పీటీఆర్టీయూ టీఎస్ నాయకులు మోహన్ రెడ్డి, కిషన్ తదితర ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.