అక్షరటుడే, తెయూ క్యాంపస్: Degree Exam Scam | ‘డిగ్రీ పట్టా’ పొందడం అనేది సగటు విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం. ఉన్నత చదువులకు వెళ్లాలన్నా, ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతకు, అలాగే ప్రైవేట్ ఉద్యోగాన్ని సాధించాలన్నా డిగ్రీ పట్టా తప్పనిసరి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య కారణాలతో డిగ్రీ పూర్తి చేయలేకపోయిన వారు ఎంతో మంది ఉన్నారు.
Degree Exam Scam | తెలంగాణ యూనివర్సిటీలో..
ఏళ్లు గడిచినా డిగ్రీ పాస్ కాలేకపోయామననే మనసులో ఒక వెలితి అలానే ఉండిపోతుంది. అలాంటి వారి ఆశలను గుర్తించి యూనివర్సిటీలు మళ్లీ డిగ్రీ పూర్తి చేసేందుకు ‘వన్ టైం ఛాన్స్’ పేరుతో ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తాయి. ఏళ్లక్రితం నిలిచిపోయిన చదువును మళ్లీ పూర్తి చేసి, సమాజంలో గౌరవంగా బతికేందుకు ఇది ఒక గొప్ప అవకాశం. అయితే, ఈ ‘చివరి అవకాశాన్ని’ ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలనే అభ్యర్థుల బలహీనతను, ఆశను కొందరు అక్రమార్కులు వ్యాపారంగా మార్చుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న ఈ ‘వన్ టైం ఛాన్స్’ పరీక్షల వెనుక అక్రమాలు, దళారుల దందా, యూనివర్సిటీ పరీక్షల విభాగంలోని సిబ్బంది పాత్రపై అనేక ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
Degree Exam Scam | రూ.వేలల్లో వసూళ్లు..
తెలంగాణ యూనివర్సిటీ (Telangana University)లో జరుగుతున్న డిగ్రీ వన్ టైం ఛాన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం కోసం అభ్యర్థులు ఎంతటి ఖర్చుకైనా సిద్ధపడుతున్నారని తెలుసుకున్న కొందరు దళారులు రంగంలోకి దిగారు. ఒక్కో అభ్యర్థి నుండి ఉత్తీర్ణత హామీ కోసం రూ. 30వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్ని సెమిస్టర్ పేపర్లు ఉన్నాసరే పరీక్షలకు హాజరైతే చాలు. మిగిలిన వ్యవహారమంతా తాము చూసుకుంటామని నమ్మబలుకుతున్నారు. ‘మళ్లీ ఇలాంటి అవకాశం జీవితంలో రాదు’ అని ఆశపెట్టి డబ్బులు వసూలు చేశారు.
Degree Exam Scam | పరీక్షల విభాగం పాత్ర.?
యూనివర్సిటీలోని పరీక్షల విభాగం ఓ ఉద్యోగి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తోందని చాలాకాలంగా వినిపిస్తోంది. దళారులతోనే ఈ వ్యవహారం ముగిసిపోలేదు. యూనివర్సిటీ పరీక్షల విభాగంలోని ఉద్యోగుల సహకారం లేకుండా పెద్దఎత్తున దందా జరగడం అసాధ్యమనే అనుమానం వ్యక్తమవుతోంది. పరీక్షల విభాగంలోని ఓ ఉద్యోగి, మరో ఇద్దరు సిబ్బంది కనుసన్నల్లోనే ఈ పర్వం కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్క డిగ్రీ వన్ టైం ఛాన్స్ పరీక్షల వ్యవహారమే కాదు పీజీ, బీఈడీ.. ఇతర పరీక్షల్లో పాస్ చేయిస్తామని డబ్బుల వసూళ్ల పర్వం చాలా కాలంగా సాగుతోందని యూనివర్సిటీలో బహిరంగ రహస్యమే.
Degree Exam Scam | కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందిపై ఆరోపణలు
ఇందులో కొందరు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా మధ్యవర్తులుగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పరీక్షల ప్రక్రియను, మార్కులను పర్యవేక్షించాల్సిన ఆడిట్ సెల్ విభాగంలోని సిబ్బంది కూడా ఈ దందాలో భాగస్వామ్యం ఉందనే ప్రచారం జరుగుతోంది. పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల నుంచి దళారులు డబ్బులు సేకరించి, తమ వాటా ఉంచుకుని, మిగిలిన సింహభాగాన్ని పరీక్షల విభాగంలో అప్పగిస్తున్నారని సమాచారం.
Degree Exam Scam | విద్యా వ్యవస్థకు చేటు
యూనివర్సిటీ అనేది విజ్ఞానాన్ని పంచే దేవాలయంగా భావిస్తారు. కానీ తెలంగాణ యూనివర్సిటీలో విద్యను వ్యాపారంగా మార్చారానే విమర్శలు తీవ్రమయ్యాయి. పరీక్షల విభాగం తీరుపై చాలా కాలంగా రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రింబవళ్లు కష్టపడి పరీక్షలకు సిద్ధమయ్యే ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఈ విధానం తీవ్ర అన్యాయం చేస్తోంది. ఈ తరహా వ్యవహారం విద్యా వ్యవస్థ పునాదులకే ప్రమాదకరం. ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి ఈ విషయంలో తక్షణమే స్పందించి తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్టను కాపాడేందుకు విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో మానవ ప్రమేయాన్ని తగ్గించి, బార్‌కోడింగ్, డిజిటల్ మూల్యాంకన పద్ధతులను పటిష్టంగా అమలు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. దళారులు డబ్బులు అడిగితే ఫిర్యాదు చేసేందుకు విద్యార్థుల కోసం ప్రత్యేక విజిలెన్స్ హెల్ప్‌లైన్, ఈ-మెయిల్ అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Rice Mill Raid | నిజామాబాద్ జిల్లాలో రైస్‌మిల్లుపై విజిలెన్స్ దాడులు.. క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం..!