అక్షరటుడే, వెబ్డెస్క్: Japan Earthquake | ప్రకృతి ప్రకోపం మరోసారి జపాన్ను తీవ్ర విషాదంలోకి నెట్టింది. మంగళవారం సంభవించిన భారీ భూకంపం దేశవ్యాప్తంగా తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది.
పలుచోట్ల భవనాలు కూలిపోవడం, అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం, రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ విపత్తులో ఇప్పటివరకు 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జపాన్ ప్రధాని సనయే తకైచి వెల్లడించారు.
Japan Earthquake | షాపింగ్ మాల్లో గ్యాస్ పేలుడు
భూకంపం అనంతరం కషిమా పట్టణంలోని ఓ షాపింగ్ మాల్లో గ్యాస్ పేలుడు సంభవించడంతో భవనం తీవ్రంగా దెబ్బతింది. అయితే పేలుడు సంభవించేలోపే అక్కడి వినియోగదారులు, సిబ్బందిని ఖాళీ చేయించినట్లు మాల్ యాజమాన్యం తెలిపింది. ఘటన అనంతరం ఎనిమిది మందిని శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీసుకురాగా, వారిలో ఐదుగురికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.
ప్రారంభంలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారనే సమాచారం వచ్చినప్పటికీ, వారి కచ్చితమైన సంఖ్య ఇంకా నిర్ధారణ కాలేదు. శిథిలాల మధ్య సురక్షిత మార్గం లేకపోవడంతో సహాయక బృందాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొందరు సిబ్బంది ఇంకా లోపలే చిక్కుకుని ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.
Japan Earthquake | కూలిపోయిన పొగ గొట్టం
యాత్సుషిరోలోని ఓ పరిశ్రమలో పొగ గొట్టం (స్మోక్స్టాక్) కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న తొమ్మిది మంది ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు కుమమోటో ప్రాంతంలో వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనేక రహదారులు దెబ్బతినగా, వేగవంతమైన షింకాన్సెన్ రైలు సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. కుమమోటో విమానాశ్రయాన్ని కొంతసేపు మూసివేసి, అనంతరం తిరిగి ప్రారంభించారు.
భూకంపం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జపాన్ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సుమారు 3,600 మంది సైనిక సిబ్బందిని సహాయక చర్యల్లో పాల్గొననివ్వడంతో పాటు, వైమానికంగా నష్టాన్ని అంచనా వేయడానికి ప్రత్యేక విమానాలను రంగంలోకి దించింది.
Japan Earthquake | “రింగ్ ఆఫ్ ఫైర్” ప్రాంతం
భూకంపం సంభవించిన సమయంలో తాను కార్యాలయంలో ఉన్నానని, భవనం ఒక్కసారిగా తీవ్రంగా ఊగిపోవడంతో ప్రాణాలు పోతాయేమోనని భయపడ్డానని స్థానిక మహిళ ఒకరు మీడియాతో పంచుకున్నారు. ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారని ఆమె తెలిపారు.
ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాల్లో జపాన్ ఒకటి. పసిఫిక్ “రింగ్ ఆఫ్ ఫైర్” ప్రాంతంలో ఉండటంతో అక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2011లో సంభవించిన భారీ భూకంపం, సునామీ వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషాదాన్ని ఇంకా జపాన్ ప్రజలు మరచిపోలేదు. తాజా భూకంపం ఆ చేదు జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేస్తూ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.