అక్షరటుడే, వెబ్డెస్క్ : SPDCL Compensation | విద్యుత్ షాక్తో మరణించిన వ్యక్తులకు ఇచ్చే పరిహారాన్ని టీజీ ఎస్పీడీసీఎల్ పెంచింది. ఈ మేరకు సీఎండీ జితేష్ వి పాటిల్ (Jitesh V Patil) ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ శాఖ సిబ్బంది కాకుండా ఇతరులు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో చనిపోతే ఇచ్చే పరిహారాన్ని సంస్థ పెంచింది. ప్రస్తుతం రూ.5 లక్షల పరిహారం ఇస్తుండగా.. ఆ మొత్తాన్ని రూ.8 లక్షలకు పెంచింది. ఈ పెంపు 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది.
SPDCL Compensation | ఆ కుటుంబాలకు ఊరట
రాష్ట్రంలో ఏటా విద్యుత్ షాక్తో వందలాది మంది చనిపోతున్నారు. ఇళ్లలో విద్యుత్ పనులు చేస్తుండగా, వైర్లు తెగిపోయి ప్రమాదాల బారీన పడుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ బోరు బావుల వద్ద రైతులు కరెంట్ షాక్తో చనిపోతున్నారు. ఆ కుటుంబాలకు ఎస్పీడీసీఎల్ పరిహారం అందిస్తోంది. విచారణ అనంతరం అధికారులు సంబంధిత చెక్కు అందజేస్తున్నారు. గతంలో రూ.5 లక్షల పరిహారం అందించగా.. దానిని రూ.8 లక్షలకు పెంచడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించనుంది. ఇందులో రూ.7.2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. రూ.80 వేల నగదు చేతికి ఇస్తారు.
మనుషులతో పాటు జంతువులు చనిపోతే కూడా పరిహారం అందిస్తున్నారు. అయితే ఈ మొత్తంలో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం గేదెలు, ఆవులు, ఎడ్లు చనిపోతే రూ.40 వేలు, మేకలు, గొర్రెలు మృతి చెందితే రూ.7 వేల పరిహారం అందిస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Sugarcane Cultivation | చెరుకు పంట సాగు విస్తీర్ణాన్ని పెంచాలి : సీఎస్ సంజయ్ జాజు