Sugarcane Cultivation | చెరుకు పంట సాగు విస్తీర్ణాన్ని పెంచాలి : సీఎస్​ సంజయ్​ జాజు

రాష్ట్రంలో చెరుకు పంట విస్తీర్ణాన్ని పెంచడానికి చర్యలు చేపట్టాలని సీఎస్​ సంజయ్​ జాజు ఆదేశించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sugarcane Cultivation | రాష్ట్రంలో చెరుకు పంట విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ, వాటి ఉత్పాదక సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (CS Sanjay Jaju) ఆదేశించారు. చక్కెర పరిశ్రమల పునరుద్ధరణపై బుధవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో మొత్తం 12 చక్కెర కర్మాగారాలు ఉండగా ప్రస్తుతం 7 మాత్రమే పనిచేస్తున్నాయని సీఎస్​ తెలిపారు. ఆ పరిశ్రమలు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలంటే ఏటా సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు అవసరమవుతుందన్నారు. కానీ రాష్ట్రంలో కేవలం 20 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు మాత్రమే ఉత్పత్తి అవుతోందని పేర్కొన్నారు. వరితో పోలిస్తే చెరుకు సాగుకు తక్కువ నీరు అవసరమవుతుందని, డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక సాగు పద్ధతులను అవలంబిస్తే దిగుబడులు పెరగడంతో పాటు సాగు వ్యయం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.

Sugarcane Cultivation | నివేదిక సమర్పించాలి

చెరుకు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు, చక్కెర పరిశ్రమలకు అవసరమైన ముడి చెరుకు లభ్యతను మెరుగుపరచేందుకు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ప్రోత్సాహకాలు, విధానాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలన్నారు. రైతు ప్రతినిధులు మాట్లాడుతూ చెరుకు రైతులకు కూడా వరి రైతులకు అందిస్తున్న తరహాలో టన్నుకు రూ.500 ప్రోత్సాహకం అందించాలని కోరారు. చెరుకు సాగులో అధిక పెట్టుబడి, వ్యవసాయ కూలీల కొరత ప్రధాన సవాళ్లుగా మారాయని వివరించారు.

దీనిని కూడా చదవండి : E20 Petrol | ఈ20 పెట్రోల్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.