అక్షరటుడే, వెబ్డెస్క్: Indian Deportation USA | అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులపై అక్కడి ప్రభుత్వం చేపడుతున్న చర్యల నేపథ్యంలో, గత ఏడాదిన్నర కాలంలో వేలాది మంది భారతీయులు స్వదేశానికి తిరిగి పంపబడ్డారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Indian Deportation USA | ఏడు నెలల్లో 1,273 మంది వెనక్కి
శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025 నుంచి 2026 జులై July వరకు మొత్తం 4,840 మంది భారతీయులను అమెరికా నుంచి బహిష్కరించి భారత్కు పంపించారు. ఇందులో 2025 సంవత్సరంలో 3,567 మంది, 2026 జనవరి నుంచి జులై వరకు మరో 1,273 మంది ఉన్నట్లు పేర్కొంది.
అమెరికా వలస చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా అక్కడ నివసిస్తున్న వారిపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ బహిష్కరణలు జరిగినట్లు సమాచారం. అక్రమ వలసలను నియంత్రించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగానే భారతీయులను కూడా స్వదేశానికి పంపినట్లు అధికారులు తెలిపారు.
Indian Deportation USA | చట్టబద్ధమైన వీసాలతోనే ప్రయాణించాలి
అమెరికాలో ఉపాధి లేదా ఇతర అవకాశాల కోసం వెళ్లే భారతీయులు చట్టబద్ధమైన వీసాలు, అవసరమైన పత్రాలతోనే ప్రయాణించాలని విదేశాంగ నిపుణులు సూచిస్తున్నారు. వలస నిబంధనలను ఉల్లంఘిస్తే బహిష్కరణతో పాటు భవిష్యత్తులో వీసా అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇక అక్రమ వలసల అంశంపై భారత్, అమెరికా మధ్య పరస్పర సహకారం కొనసాగుతుండగా, చట్టపరమైన ప్రక్రియల ప్రకారమే బహిష్కరణలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.