అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Cyber Crime Awareness | సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. జాతీయ సైబర్ జాగృతి దివస్ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నగరంలోని విజయ్ రూరల్ ఇంజినీరింగ్ కళాశాల(VREC)లో సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Cyber Crime Awareness | డిజిటల్ యుగంలో అనేక ఘోరాలు..
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో.. అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా స్టాక్ ట్రేడింగ్, స్టాక్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. మోసగాళ్లు ‘100శాతం గ్యారంటీ రిటర్న్స్’, ‘డైలీ ప్రాఫిట్’, ‘ఇన్సైడర్ టిప్స్’ వంటి తప్పుడు హామీలతో అమాయక ప్రజలను ఆకర్షిస్తున్నారని తెలిపారు. నకిలీ ట్రేడింగ్ యాప్లు, నకిలీ వెబ్సైట్లు, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ప్రారంభంలో నకిలీ లాభాలను చూపించి అనంతరం మరింత పెట్టుబడి పెట్టేలా ప్రలోభపెట్టి చివరకు డబ్బు మొత్తం లాగేస్తారన్నారు.
Cyber Crime Awareness | సైబర్ మోసానికి గురైతే..
సైబర్ మోసాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైం హెల్ప్లైన్కు కాల్ చేయాలని సీపీ సూచించారు. నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. త్వరితగతిన ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖ ప్రజల భద్రతకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉందన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, సంబంధిత శాఖలతో సమన్వయంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.
కార్యక్రమం అనంతరం విద్యార్థులు, పోలీసు అధికారులు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి సైబర్ అవగాహన పోస్టర్స్ ఆవిష్కరణ చేసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, నిజామాబాద్ రూరల్ (నార్త్) సీఐ శ్రీనివాస్, సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ముఖీద్ పాషా, మాక్లూర్ ఎస్సై అనిల్ కుమార్, సైబర్ క్రైం ఎస్సైలు రవికుమార్, ప్రవళిక, సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ సిబ్బంది, విజయ్ రూరల్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాళ్లు గణేష్, సురేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: కేంద్ర మంత్రిని కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు