అక్షరటుడే, కామారెడ్డి: Child Abuse Case | పోషించడం భారంగా భావించి సొంత కూతురినే కడతేర్చేందుకు తండ్రి, సవతి తల్లి కుట్ర పన్నారు. ఏడు నెలల చిన్నారిని బ్లేడుతో గాట్లు పెట్టి.. కుక్కలు కరిచాయని కట్టుకథ అల్లారు. ఎట్టకేలకు వారిద్దరు కటకటాల పాలయ్యారు. బీర్కూర్ మండలంలో జరిగిన ఈ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మేరకు బాన్సువాడ(Banswada) డీఎస్పీ విఠల్ రెడ్డి సోమవారం వివరాలు వెల్లడించారు.
Child Abuse Case | బీర్కూర్ మండలంలో..
రెండేళ్ల క్రితం సంకు శైలజ భర్త టేకు సతీష్‌ను ఆమె చెల్లెలు సంధ్య రెండో వివాహం చేసుకుంది. వారికి వైష్ణవి అనే కూతురు పుట్టింది. అయితే దాంపత్య విభేదాలతో పెద్దల సమక్షంలో విడిపోయి చిన్నారిని సతీష్ దగ్గరే ఉంచారు. ఈనెల 15న ఉదయం ఇంట్లో చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా, ఇంటి సమీపంలోని ముళ్ల పొదల్లో తీవ్ర గాయాలతో వైష్ణవి అపస్మారక స్థితిలో లభించింది. వెంటనే బాన్సువాడ, నిజామాబాద్(Nizamabad) ఆస్పత్రులకు తరలించి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్(Hyderabad) నిలోఫర్ ఆస్పత్రికి(Niloufer Hospital) తీసుకెళ్లారు. ఈ ఘటనపై సంధ్య తన అక్క శైలజపై అనుమానం వ్యక్తంచేస్తూ బీర్కూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సతీష్‌కు మొదటి భార్య శైలజతో ముగ్గురు పిల్లలు ఉన్నారు. తర్వాత చెల్లెలు సంధ్యను పెళ్లి చేసుకున్నాడు. విడాకుల తర్వాత వైష్ణవిని పెంచడం భారంగా మారడంతో, కుటుంబ గొడవల కారణంగా చిన్నారిని అడ్డు తొలగించుకోవాలని సతీష్, శైలజ పథకం వేశారు.
Child Abuse Case | సీసీ రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి.. బ్లేడ్లతో గాట్లు పెట్టి..
ఈనెల 14 అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న వైష్ణవిని ఇద్దరూ కలిసి తీసుకెళ్లి సీసీ రోడ్డుపై ఈడ్చుకుంటూ కొంత దూరం తీసుకెళ్లారు. అనంతరం గడ్డి ఉన్న చోట పడుకోబెట్టి వెంట తెచ్చుకున్న బ్లేడ్లతో శరీరంపై పలుచోట్ల గాయాలు చేశారు. చిన్నారి ఏడుపు ఆగిపోవడంతో చనిపోయిందని భావించి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం చిన్నారి కనిపించడం లేదంటూ గ్రామ పెద్దలకు చెప్పి, గ్రామస్తులతో కలిసి వెతుకుతున్నట్లు నటించారు. చిన్నారి ఉన్న చోటు ముందే తెలిసి కూడా అక్కడికి వెళ్లి కనిపించినట్లు చెప్పారు.
రాత్రి కుక్కలు ఎత్తుకెళ్లి గాయపర్చాయని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. విచారణలో నిందితులు నేరం అంగీకరించారు. ఈ కేసులో పోలీసులు టేకు సతీష్, సంకు శైలజలను అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది: మంత్రి ఉత్తమ్ కుమార్